
2020 సంవత్సరాన్ని దేశంలోని చాలా మంది ప్రజలు బ్యాడ్ ఇయర్ గా భావిస్తున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సాఫీగా సాగుతున్న సామాన్య మానవుడి జీవితంలో కరోనా సృష్టించిన విలయం అంతాఇంతా కాదు.
ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే ఎవరికీ తెలియని వ్యాధితో ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, పెద్ద పోచారం గ్రామంలో ప్రజలు చనిపోతున్నారు. కళ్ళముందే గ్రామంలోని ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతుంటే కారణాలు తెలీక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ చావు వార్త వినాలో అని భయాందోళనకు గురవుతున్నారు.
చనిపోతున్న వాళ్లు జ్వరం వచ్చి చనిపోతున్నారని ఆరోగ్యంగా ఉన్నవాళ్లు చనిపోవడం తమలో ఆందోళన పెంచుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో జ్వరాల వ్యాప్తి ఉన్నా ప్రజలు కరోనా భయంతో ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామంలో సెప్టెంబర్ 15 వ తేదీ నుండి ఈ నెల 6 వరకు 12 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో అన్ని వయస్సుల వాళ్లు ఉన్నారు.
గ్రామస్తుల్లో కొందరు జ్వరం అని చెప్పినా కరోనా అంటారని భయంతో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తమ గ్రామాలకు వచ్చి ఎవరూ కరోనా పరీక్షలు చేయడం లేదని, గ్రామంలో ఇంతమంది చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు ఈ గ్రామంపై దృష్టి పెట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.