World Cancer Day 2025: చుట్టూ నిరాశ.. అలముకున్న గాఢాంధకారం.. వెలుగు జాడలేదు.. నవోన్మేషం ఆశ లేదు. అదిగో అప్పుడే పుట్టింది ఒక చిన్న ఆశవాహ దృక్పథం.. అది అంతకంతకు పెరిగింది.. చీకటిని తరిమికొట్టింది. అంధకారం స్థానంలో వెలుగు నింపింది.. బతుకు మీద నమ్మకాన్ని కల్పించింది.. నిలువెత్తు దృఢత్వాన్ని.. ఆకాశం ఎత్తు బలాన్ని సమకూర్చింది.. చివరికి జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. చదువుతుంటే గొప్పగా అనిపిస్తోంది కదా.. క్యాన్సర్ రోగులకు కావాల్సింది కూడా ఇదే.
క్యాన్సర్ అనేది ఒకప్పుడు కొంత మందికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు క్యాన్సర్ అంతటా విస్తరిస్తోంది. వర్గం తేడా లేకుండా.. వయస్సుతో సంబంధం లేకుండా.. సోకుతోంది. క్యాన్సర్ వస్తే జీవితం ముగిసింది అని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు వైద్య విధానాలు ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు కాబట్టి అలాగే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. పైగా క్యాన్సర్ సోకిన వాళ్లకు ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. అది పెంచుకుంటే జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. అంతేకాదు క్యాన్సర్ పై ఘన విజయాన్ని కూడా సాధించవచ్చు.. మనదేశంలో చాలామంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు. క్యాన్సర్ బారిన పడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారంతా కూడా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ వ్యాధిని జయించారు. నేడు (మంగళవారం, ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం. ఈ సందర్భంగా క్యాన్సర్ ను జయించిన సెలబ్రిటీలు.. తమ మనోగతాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సెలబ్రిటీలు ఏమన్నారంటే..
క్యాన్సర్ వచ్చిందని కుంగిపోవద్దని.. దానిని జయించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. క్రికెటర్ యువరాజ్ కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డవారే.. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రక్తం కక్కుతున్నప్పటికీ జట్టు విజయానికి కృషి చేశారు.. అయితే ఆ సమయంలో పరీక్ష చేయగా క్యాన్సర్ సోకడంతో ఒక్కసారిగా డీలా పడ్డారు. ఆ తర్వాత తనకు తానే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని.. చివరికి క్యాన్సర్ వ్యాధిని జయించారు. క్యాన్సర్ కు ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో పుస్తకాలు చదివారు. ప్రకృతిని అదే పనిగా పరిశీలించారు. వ్యక్తుల జీవిత చరిత్రలను చదివారు. చివరికి క్యాన్సర్ వ్యాధిపై విజయం సాధించారు.. “క్యాన్సర్ వచ్చిందంటే దానిని జయించడమే మన ముందున్న ఏకైక అవకాశం
.. అందువల్ల నిరాశ పడకుండా ధైర్యంగా అడుగులు వేయాలని” యువరాజ్ పేర్కొన్నారు..ప్రముఖ నటి హంసానందిని కూడా క్యాన్సర్ బాధితురాలే. ఆమె తల్లి కూడా క్యాన్సర్ వల్లే చనిపోయారు. ఒకసారి పరీక్ష చేయించుకోగా.. క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక దశలో ఆమె జుట్టును కూడా కోల్పోయారు. ఆ తర్వాత అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని క్యాన్సర్ విజేతగా నిలిచారు. “నాకు బాధితురాలుగా ఉండాలి అంటే ఏమాత్రం నచ్చదు. భయం, నెగిటివిటీకి నా జీవితంలో చోటు ఇవ్వనని” హంసానందిని పేర్కొన్నారు.. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా క్యాన్సర్ బారిన పడ్డవారే. ఆయన కూడా ట్రీట్మెంట్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డవారే. కాని చివరికి క్యాన్సర్ వ్యాధిని జయించారు. ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. “బలమైన సైనికులకు దేవుడు కష్టమైన యుద్ధాలు ఇస్తాడు. ఆ యుద్ధాలను కచ్చితంగా గెలవాలి. అప్పుడే మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని” సంజయ్ దత్ పేర్కొన్నారు.. వీరు మాత్రమే కాకుండా సోనాలి బింద్రే, ఇంకా పలువురు సెలబ్రిటీలు క్యాన్సర్ నివారణ దినోత్సవ సందర్భంగా తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.