Homeలైఫ్ స్టైల్Sleep Tips: అతిగా నిద్రపోతున్నారా.. ఇలా చేయండి

Sleep Tips: అతిగా నిద్రపోతున్నారా.. ఇలా చేయండి

Sleep Tips: నిద్ర పట్టక కొంతమంది బాధపడితే, మరికొందరు అతి నిద్రతో సతమతమవుతుంటారు. అయితే నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరమో, ఒకవేళ అతి నిద్ర సమస్యతో బాధపడుతున్నట్లయితే దానిని అధిగమించడమెలాగో తెలుసుకుందాం రండి..

ఎవరికి ఎన్ని గంటలు అంటే..
వయసును బట్టి నిద్ర సమయాలు తెలుసుకుంటే అతి నిద్రకు అడ్డుకట్ట వేయచ్చంటున్నారు నిపుణులు. తద్వారా ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చంటున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరమంటే..

– అప్పుడే పుట్టిన పిల్లలు : 14–17 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)

– ఏడాదిలోపు చిన్నారులు : 12–15 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)

– 1–2 ఏళ్ల వయసున్న వారు : 11–14 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)

– 3–5 ఏళ్ల వయసున్న వారు : 10–13 గంటలు

– స్కూలుకెళ్లే పిల్లలు (6–12 ఏళ్లు) : 9–11 గంటలు

– టీనేజర్లు (13–19 ఏళ్లు) : 8–10 గంటలు

– పెద్దలు : 7–9 గంటలు

– వృద్ధులు : 7–8 గంటలు

అతి నిద్రకు ఇలా చెక్‌..
ఒకవేళ అతి నిద్ర సమస్యతో బాధపడుతున్నట్లయితే రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు.

– రోజూ ఒకే తరహా నిద్ర సమయాల్ని పాటించాలి. అంటే.. వారాంతాలు, సెలవు రోజుల్లో కూడా నిర్ణీత వేళకే నిద్ర లేవాలన్న మాట.

– కొంతమందికి రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక ఉదయం ఆలస్యంగా లేస్తుంటారు. అలాంటి వాళ్లు నిద్రకు ఉపక్రమించేలా పడకగదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నిద్రా భంగం చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాలను దూరం పెట్టాలి.

– కెఫీన్‌కు నిద్రను భంగం చేసే లక్షణముంది. కాబట్టి కాఫీ, టీ వంటివి పడుకునే ముందు అస్సలు తాగకూడదు.

– మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు నిద్ర పట్టదు. తద్వారా గంటల తరబడి నిద్రపోవడానికి శరీరం అలవాటు పడుతుంది. కాబట్టి పగలు అరగంటకు మించి కునుకు తీయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

– వ్యాయామాల వల్ల ఆరోగ్యమే కాదు.. నిద్ర సమయాలు కూడా అదుపులో ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరం అలసిపోయి తద్వారా నిద్రలేమిని కూడా అధిగమించచ్చు.

– అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సుఖ నిద్రను ప్రేరేపించే పాలు, పాల పదార్థాలు, బాదం, కివీ పండ్లు, చామొమైల్‌ టీ.. వంటివి తరచూ తీసుకోవడం మంచిది.

వీటితోపాటు మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను దూరం పెట్టడమూ ముఖ్యమే. అయితే ఇన్ని చేసినా అతి నిద్రను దూరం చేసుకోలేకపోయినా, ఇతర అనారోగ్యాలు వేధిస్తున్నా.. వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular