
ప్రపంచ దేశాల్లోని ప్రజలు కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే సంవత్సరం జనవరి నాటికి సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అనేక కంపెనీలు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను జరుపుతుండగా తుది దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఏదో ఒక వ్యాక్సిన్ ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్లతో పోలిస్తే ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్ ను ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోన వైరస్ కళ్లు, ముక్కు, నోరు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి అనేక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. చాలామంది కరోనా రోగులు శ్వాస సంబంధిత సమస్యల బారిన పడి చనిపోతున్నారు. కరోనా వైరస్ మనుషుల శరీరంలోని ఇమ్యూనిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కరోనా వైరస్ ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తూ ఉండటంతో ముక్కు లేదా నోటి ద్వార కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వడంపై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ వైద్యులు ఇప్పటికే ఈ తరహా ప్రయోగాలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించారు. ముక్కు లేదా నోటి ద్వారా వేసే వ్యాక్సిన్లు కరోనా రోగులకు మంచి ఫలితాలను ఇస్తాయని తేల్చారు.
అలబామా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సైతం కరోనా వ్యాక్సిన్ గురించి అనేక ప్రయోగాలు చేసి ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ మిగిలిన వ్యాక్తిన్లతో పోలిస్తే అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని వెల్లడించారు. ఈ తరహా వ్యాక్సిన్లను తయారు చేయాలని ఇప్పటికే వ్యాక్సిన్లను తయారు చేస్తున్న కంపెనీలకు సూచనలు చేస్తున్నారు.