మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది కారును కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇయర్ ఎండ్ నేపథ్యంలో పలు ప్రముఖ కంపెనీలు కొత్త కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను సైతం ప్రకటిస్తున్నాయి. అయితే కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా కారును కొనుగోలు చేస్తే మంచిది. కారును కొనుగోలు చేయడానికి ఆలస్యం చేస్తే మాత్రం 2021 జనవరి నుంచి ఎక్కువ మొత్తం చెల్లించి కార్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఈ ఏడాది కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలను చవిచూశాయి. అయితే కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దీంతో కార్ల విక్రయాలు గడిచిన మూడు నెలల నుంచి పుంజుకున్నాయి.
అయితే నష్టాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో 2021 సంవత్సరం నుంచి కార్ల కంపెనీలు కార్ల ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొన్ని రోజుల క్రితం ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కమోడిటీ ధరలు, ఇతర ఇన్ పుట్ ధరలు పెరగడం కూడా కార్ల ధరలు పెరగడానికి కారణమవుతోంది.
మరో ప్రముఖ సంస్థ మారుతి సుజుకి సైతం జనవరి నుంచి కార్ల ధరలను పెంచబోతున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. హ్యుండాయ్, కియా మోటార్స్ సంస్థలు కూడా కార్ల ధరలను పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రెనాల్ట్ కంపెనీ సైతం జనవరి 1 నుంచి అన్ని రకాల మోడల్ కంపెనీలపై 28 వేల రూపాయల వరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటన చేసింది. కార్లను కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఈ ఏడాదే కార్లను కొనుగోలు చేస్తే కొంతమేర డబ్బు ఆదా చేసుకోవచ్చు.