
వివాహం అంటే ఒక నమ్మకం. కష్టసుఖాల్లో చివరి దాకా తోడుంటానని ఆలుమగలు చేసుకునే వాగ్ధానం. కానీ.. చాలా మంది విషయంలో ఈ వాగ్ధానం మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత గొప్పది, బలమైనదిగా చెప్పుకునే భారతీయ వివాహ వ్యవస్థ సైతం చెడిపోతోంది. చెదలు పట్టిపోతోంది! నలుగురి మధ్య ఒకరిని పెళ్లి చేసుకుంటున్నవారు.. నాలుగు గోడల మధ్య ఇంకొకరితో కాపురం చేస్తున్నారు!! ఆధునిక యుగంలో ఈ పరిస్థితి వేగంగా విస్తరిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఫారెన్ కంట్రీస్ లో ఇదొక విశృంఖల వ్యవహారం. అమెరికా వంటి దేశాల్లో.. ఆడ, మగ వృద్ధులు అయ్యేనాటికి కనీసం ఇద్దరు ముగ్గురు భర్తలు లేదా భార్యలు ఉంటారని అంటారు. అయితే.. అది అఫీషియల్. కానీ.. అనధికారికంగా చాటుమాటు వ్యవహారాలు నడిపించడం ఇప్పుడు ఇండియాలో పెరిగిపోతోందట. ఒక ఆన్ లైన్ డేటింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 13 లక్షల మంది సభ్యులు కలిగిన ఈ సంస్థ చేపట్టిన సర్వేలో.. 30 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలలో.. 48 శాతం మంది తాము భర్తతో కాకుండా ఇతరులతో కూడా రిలేషన్లో ఉన్నట్టు ఒప్పుకున్నారట.
ఆడవాళ్ల విషయంలోనే ఇలా ఉంటే.. ఇక మగాళ్ల సంగతి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఎక్కువ మందితో రిలేషన్ పెట్టుకుంటే.. అంత ఘనమైన మగాడిగా భావించేవాళ్లకు మన దేశంలో కొదవలేదు. అయితే.. ఇలాంటి అనైతిక బంధాలు చివరకు విషాదాంతాలే అవుతాయని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కానీ.. అసలు మనుషులు ఇలా ఎందుకు వ్యవహరిస్తారు? తమ భాగస్వామిని వదిలి ఇతరులతో ఎందుకు పక్కను కూడా పంచుకుంటారు? అన్నప్పుడు పలు ప్రధాన విషయాలు చెబుతున్నారు నిపుణులు.
పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం.. ఆ తర్వాత సడలిపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంటే.. కాలం గడుస్తున్నకొద్దీ.. ఒకరినొకరు పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇది పక్కచూపులు చూసేలా చేయొచ్చు. ఇది జరగకుండా చూసుకోవాలి.
ఉద్యోగం, ఇతరత్రా కారణాలతో భాగస్వామికి సమయం కేటాయించలేకపోవడం. దీనివల్ల కూడా మనస్పర్థలు పెరుగుతాయి. సమస్యలు ఎన్నిఉన్నా.. అవి తాత్కాలికమే అని అర్థం చేసుకోండి. మీ భాగస్వామికి సమయం కేటాయించి, మనసు విప్పి మాట్లాడుకోండి. సమస్య పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది. మీ మనసు రిలాక్స్ అవుతుంది. బంధం బలపడుతుంది.
ప్రతీకారం. సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటారు. ఇది దీర్ఘ కాలం కొనసాగితే.. కనిపించని దూరం ఏర్పడుతుంది. అందువల్ల ఏదైనా సమస్య వస్తే.. దాని గురించే మాట్లాడండి. వ్యక్తిగత దూషణలు పక్కనపెట్టింది. మీరు ప్రత్యర్థులు కాదు. జీవిత భాగస్వాములు. మీ లక్ష్యం సమస్య పరిష్కరించుకోవడం అవ్వాలి కానీ.. పెద్దది చేసుకోవడం కాదు.
రొటీన్ లైఫ్ తో కూడా విసిగిపోయే అవకాశం ఉంటుంది. అది బోర్ కొట్టడం వంటి పరిస్థితులకు కారణం కావొచ్చు. అందువల్ల మీ జీవితాన్ని వీలైనంత కొత్తగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. ఈ సమస్యలు, ఉద్యోగాలు ఎప్పుడూ చచ్చేవే. వీటిని అలా వదిలేసి.. నెలకో, రెండు నెలలకో ఒకసారి అలా ప్రశాంతంగా నచ్చిన చోటికి వెళ్లిరండి.
ముందుగా చెప్పినట్టు నమ్మకమే అంతిమం. ఈ నమ్మకం ఎక్కడి నుంచో ఊడిపడదు. మరెక్కడో దొరకదు. అది మీలోనే ఉంటుంది. భాగస్వాములు ఎవరికోసం వారు కాకుండా.. ఒకరి గురించి మరొకరు ఆలోచించినప్పుడు నమ్మకం అదే పుడుతుంది. బలపడుతుంది. ఆల్ ది బెస్ట్.