ప్రతిరోజు సరైన ఆహారం.. మంచి నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఒత్తిడిలు, సమస్యలు ఉండడంతో చాలామంది కంటినిండా నిద్రపోవడం లేదు. మరికొందరు రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకువతో ఉండడం వల్ల కలత నిద్ర పోతున్నారు. అయితే ఇదే అలవాటుగా ఉండి కొన్ని రోజుల తర్వాత రాత్రి నిద్ర పట్టే అవకాశం ఉండదు. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రతిరోజు నిద్ర పోవడానికి ప్రత్యేక ప్లాన్ వేసుకోవాలి. కానీ ఒక్కోసారి ఈ ప్లాన్ వర్కౌట్ కాదు. ఇలాంటి సమయంలో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరి ఆ పానీయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా రాత్రి భోజనం చేసి వెంటనే పడుకునే వారు ఎక్కువమంది ఉంటారు. ఆ తర్వాత తక్కువ నీరు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ నీరు తీసుకోవాలని అనుకున్నా.. సాధారణ నీరు కంటే హెర్బల్ టీ తాగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుందని అంటున్నారు. హెర్బల్ టి అంటే ప్రత్యేకంగా బయట దొరికే పానీయం ఏం కాదు. దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేడి నీళ్లలో తులసి వేసుకొని ఆ కషాయం తాగడం వల్ల మానసికంగా ఒత్తిడి తగ్గిపోతుంది. దీంతో మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. కూరల్లో వేసుకునే పుదీనా ఎంతో సువాసన ఇస్తుంది. ఈ సువాసన కలిగిన పుదీనాతో టీ చేసుకొని తాగడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఈ టీతో మటుమాయమవుతుంది. అలాగే వేప, సెలరి, అశ్వగంధ, బ్రహ్మీ ఆకులు టీ లాగా కాకుండా నేరుగా నమ్మడం వల్ల కూడా ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఆకులను నమిలితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇవే కాకుండా రాత్రి సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఆహారంలో నియమాలు పాటిస్తూ.. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బరువు సమస్యతో అనేక అనారోగ్యాలు దరిచేరే అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్యాల కారణంగా మానసికంగా ఒత్తిడి పెరిగే నిద్ర పట్టే అవకాశం ఉండదు. అందువల్ల ముందుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మానసికంగా ప్రశాంతత కోసం హెర్బల్ టీ తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఈ పానీయాన్ని తాగడం వల్ల.. మంచి నిద్ర ఉండడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు.