Breast Cancer: జీవనశైలి మారుతోంది. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. శారీరక శ్రమ తగ్గుతోంది. ఫలితంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న వ్యాధుల్లో కొత్త తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాంటి వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి. ఒకప్పుడు ఈ క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే వస్తుందనుకునేవారు. ఈ క్యాన్సర్ సోకిన వారి రొమ్ముల్లో గడ్డలు ఏర్పడుతుంటాయి. ఒకటి లేదా రెండు దశల్లో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. మూడవ దశకు చేరుకుంటే మాత్రం ఆ క్యాన్సర్ ను నివారించే పరిస్థితి ఉండదు. వైద్య చికిత్స విధానాలు ఈ స్థాయిలో అభివృద్ధి చెందినప్పటికీ రొమ్ము క్యాన్సర్ వల్ల మనదేశంలో భారీగానే మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నా, మొన్నటి వరకు రొమ్ము క్యాన్సర్ అంటే కేవలం ఆడవాళ్లకు మాత్రమే వస్తుందనుకునేవారు. కానీ తాజా అధ్యయనం ప్రకారం రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా వస్తుందని తేలింది.
పురుషుల్లో రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. అలా తక్కువ కణజాలం ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రపంచంలో పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ కేసులు పెరగడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. పురుషుల్లో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో ఒక శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఉండడం విశేషం.
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ను సులభంగా గుర్తించవచ్చు. రొమ్ము చుట్టూ నొప్పి, వాపు, పుండ్లు, ఎరుపు రంగులో నిపుల్స్ ఉండడం.. వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక స్త్రీలలో అయితే నిపుల్స్ నుంచి చీము లాంటి ద్రవం కారడం, నిపుల్ లోపలికి వెళ్లిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఏమాత్రం అజాగ్రత్త చేయొద్దు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాద తీవ్రతను తెలుసుకొనడానికి BRCA పరీక్ష చేయించుకోవాలి. ఇది జన్యు పరీక్ష. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితాలు పాజిటివ్ గా వస్తే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారించిన అనంతరం భయపడాల్సిన అవసరం లేదు. సరైన చికిత్స తీసుకుంటే వెంటనే కోలుకోవచ్చు.
రోజూ వ్యాయామం చేయడం. మద్యం, పరిమితికి మించిన మాంసాహారానికి దూరంగా ఉండటం, ధూమపానం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తినకపోవడం, తాజా ఆకుకూరలు, కాయగూరలను తినడం, కాలుష్య కారక వాతావరణానికి దూరంగా ఉండటం వంటివి పాటిస్తే క్యాన్సర్ శరీరానికి సోకకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.