Adventures : జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. అలా ఉంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడూ రొటీన్ జీవితానికి భిన్నంగా వ్యవహరించాలి. సాహాసాలను ఆస్వాదించాలి.. సరదాగా సముద్రం లోతులోకి, నీలి గగనం దగ్గరలోకి, పర్వతాల అంచులోకి విహరించాలి..అలాగని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. ఇంతకీ అలాంటి సాహస క్రీడలు ఏమున్నాయంటే..

స్కై డైవింగ్
గగనవీధిలో.. ఘన నిశీధిలో మెరిసిన మెరుపులా.. అని ఓ సినీ కవి రాసినట్టు.. ఆకాశంలో సరదాగా చక్కర్లు కొట్టాలంటే స్కై డైవింగ్ ను మించింది లేదు. పారాచూట్ సహాయంతో ఆకాశంలో అలా ఎగిరిపోతుంటే.. ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఇలాంటి సాహస క్రీడను దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చేయకపోవడమే మంచిది.
బంగి జంప్
అంతెత్తున ఉన్న పర్వతం నుంచి రెండు కాళ్లకు ఒక తాడును కట్టుకొని తలకిందులుగా నీటిని తాకడమే బంగి జంప్ అంటారు. ఇలాంటి సాహస క్రీడను బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి చేసి చూపించాడు. ఆ తర్వాత చాలామంది ఆ ప్రాంతానికి వెళ్లి ఆ సహస క్రీడను ఆస్వాదించారు. మన దేశంలో కంటే విదేశాల్లో ఇది చాలా ఫేమస్.

వైట్ వాటర్ రాఫ్టింగ్
అటు ఇటు రెండు పర్వతాలు.. మధ్యలో వేగంగా నీటి ప్రవాహం.. ఆ ప్రవాహం మీదుగా గుండ్రాటి పడవ.. అందులో కొంతమంది ఔత్సాహికులు.. ఆ నీటి ప్రవాహం మీద అంతే వేగంగా ప్రయాణం సాగించడాన్ని వైట్ వాటర్ రాఫ్టింగ్ అంటారు. ఇలాంటి సాహస క్రీడ మనదేశంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.
రాక్ క్లైబింగ్
అంత ఎత్తున ఉన్న పర్వతాన్ని తాళ్ళ సహాయంతో ఎక్కడాన్ని రాక్ క్లైబింగ్ అంటారు. ఇలా పర్వతాలను ఎక్కడం వల్ల సానుకూల శక్తి ఏర్పడుతుందని ఔత్సాహికులు నమ్ముతుంటారు.

పారా గ్లైడింగ్
సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సాహసక్రీడను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. పారాచూట్ సహాయంతో నిర్ణీత ఎత్తుకు ఎగిరిన తర్వాత.. అంత ఎత్తు నుంచి సముద్ర జలాలను చూడడం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. మనదేశంలో సముద్రతీర ప్రాంతాల్లో చాలామంది పర్యాటకులు పారా గ్లైడింగ్ చేయడాన్ని ఇష్టపడుతుంటారు.
మౌంటెన్ బైకింగ్
దుర్భేద్యమైన దారులున్న పర్వతాల పైకి సైకిల్ పై ప్రయాణించడాన్నే మౌంటెన్ బైకింగ్ అంటారు. ఈ మౌంటెన్ బేకింగ్ చేయడానికి ప్రత్యేకమైన సైకిల్స్ ఉంటాయి. అలా సైకిల్ మీద పర్వతం ఎక్కడం సరికొత్త అనుభూతికి గురిచేస్తుంది. ఇలా సైకిల్ తొక్కడం వల్ల శారీరక శ్రమ ఏర్పడి.. దేహంలో పేరుకుపోయిన కొవ్వులు కరిగిపోతాయి.

డీప్ సీ డైవింగ్
సముద్రపు లోతు చూడాలి అనుకునే వారికి డీప్ సీ డైవింగ్ అనేది సరికొత్త అనుభూతిని ఇస్తుంది.. ప్రత్యేకమైన శిక్షకుల సహాయంతో సముద్రపు లోతుకు వెళ్లి అక్కడ జలచరాలను, మట్టిని డీప్ సీ డైవింగ్ ద్వారా పరిశీలించవచ్చు.
జంగిల్ సఫారీ
దట్టమైన అడవుల్లో జంతువులను చూడాలి అంటే జంగిల్ సఫారీ ని మించింది లేదు. దీనివల్ల జంతువులు ఎలా జీవిస్తున్నాయి? ఎలా వేటాడుతున్నాయి? వాటిని అవి ఎలా రక్షించుకుంటున్నాయి? అనే వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. మనదేశంలో మహారాష్ట్ర, చతిస్గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు జంగిల్ సఫారీ అనుభవాన్ని పర్యాటకులకు కలిగిస్తున్నాయి.