Tirumala laddu : తెలుగు ప్రజలే కాదు దేశంలోని మెజారిటీ హిందువులు తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. తిరుమలలోని ఏడు కొండలపై కొలువైన స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యమని భావిస్తారు. ఇలా స్వామివారిని ఎంతలా నమ్ముతారో ఆయన లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు… కళ్లకు అద్దుకుని ఆరగించడమే కాదు ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు, బంధువులు, స్నేహితులకు పంచిపెడతారు. ఇలాంటి లడ్డూలో గత వైసిపి పాలనలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ప్రచారం హిందువులు మరీముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.
ఇలా తిరుమల లడ్డుపై వివాదం కొనసాగుతున్న వేళ ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ కీలక చర్యలు చేపట్టింది. తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని అధికార టిడిపి కూటమి అంటే.. కాలేదని ఇటీవలే అధికారాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వాదిస్తున్నారు. దీంతో ఎవరు చెప్పేది నిజమో తేల్చుకోలేక శ్రీవారి భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
తిరుపతి లడ్డూ ఎక్కడ పడితే అక్కడ లభించదు. కేవలం ఈ లడ్డూ తిరుమల, టిటిడి అనుబంధ ఆలయాల్లో మాత్రమే లభిస్తుంది. అయితే నిర్దిష్టమైన పదార్థాలతో స్వచ్చమైన నెయ్యితో తిరుమల లడ్డూను తయారు చేస్తుంటారు. కానీ గత వైసిపి ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డూను అపవిత్రం చేసారని టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించి తయారుచేసిన కల్తి నెయ్యి ఉపయోగించారని తీవ్ర ఆరోపణలున్నాయి.
లడ్డూను సేకరించి అందులో వాడిని నెయ్యి నాణ్యతను తెలుసుకునేందుకు ల్యాబ్ లో టెస్టులు చేయించారు. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు తిరుమల లడ్డూ శాంపిల్ పంపించి టెస్ట్ చేయించారు. టెస్ట్ ల్లో ప్రస్తుతం తిరుమలలో లభిస్తున్న లడ్డూలో కల్తీ లేదని స్వచ్చమైన నెయ్యి అని తేలింది.
గత నెల అక్టోబర్ 17 న తిరుమల లడ్డూ శాంపిల్ ను టెస్ట్ కోసం పంపించారు. తిరుపతి లడ్డూతో పాటు మథుర,బృందావన్ ప్రసాదాన్ని కూడా టెస్టుల కోసం పంపించారు. ఈ మూడు ప్రసాదాల్లో జంతువుల కొవ్వు లేదని తేలినట్లు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా.ముకుల్ దాస్ తెలిపారు. ఈ మూడు శాంపిల్స్ లో స్వచ్చమైన దేశీ నెయ్యిని గుర్తించామని … కాబట్టి ఈ ప్రసాదాలు పూర్తిగా ఆరోగ్యకరమని స్పష్టం చేసారు. మొత్తం మీద లడ్డూ మీద ప్రస్తుతం ఉన్న అనుమానాలు తొలిగిపోయాయి.