Work Without Stress: ప్రస్తుత కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం బిజీ వాతావరణం లో గడుపుతున్నారు. కొందరు డబ్బుకోసం తీరికలేకుండా పనిచేస్తే.. మరికొందరు తమ లక్ష్యం కోసం కష్టపడుతున్నారు. అయితే ఎవరు దేనికోసం ప్రయత్నించినా… వారిలో ఒత్తిడి కామన్ గా ఉంటుంది. అంటే ఒక చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తానో.. లేదోనని కొందరు అనుకుంటే.. అనుకున్నంత డబ్బు సంపాదిస్తానో.. లేదోనని మరికొందరు బాధపడుతూ ఉంటారు. అయితే ఇటీవల కొందరు యువత చెబుతున్న మాట ఏమిటంటే.. తమ జీవితం ప్రశాంతంగా లేదని.. అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించినా కూడా తృప్తికరమైన జీవితం లేదని అంటున్నారు. మరి ప్రశాంతమైన జీవితం కావాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రణాళిక వేసుకోవాలి?
జీవితం గురించి కొందరు తమ సొంత అనుభవం ద్వారా తెలుసుకుంటే.. మరికొందరు పెద్దల ద్వారా.. ఇతరుల ద్వారా జీవితంలో ఎలా బతకాలి? అనే విషయాలను నేర్చుకుంటారు. అయితే మన జీవితం సక్రమమైన మార్గంలో ఉండాలంటే కొన్ని పురాతనమైన కథల గురించి కూడా తెలుసుకోవాలి. ఒకప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పటి జీవితానికి అద్దం పట్టే విధంగా ఉంటున్నాయి. ఇందులో రామాయణం లోని జనక మహారాజు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
జనకమహారాజు ఒకవైపు రాజ్యాన్ని పాలిస్తూనే.. మరోవైపు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారని పురాణాల్లో తెలుస్తోంది. ఒకసారి వ్యాస మహర్షి జనక మహారాజు వద్దకు వచ్చి రాజ్యాన్ని ఎలా పాలిస్తున్నారు? అని అడుగుతారు. ఇంతమంది మనుషులు.. ఎంతోమంది సైనికులు.. కుటుంబ వ్యవహారాలు.. ఇవన్నీ సమతుల్యంగా చేసి అందమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ఎలా సాధ్యం? అని అడుగుతాడు. అప్పుడు జనక మహారాజు నవ్వుతూ ఒక సమాధానం ఇస్తాడు. ఒకవైపు వీరు మాట్లాడుకుంటూనే ఉండగా.. మరోవైపు అక్కడ కచేరి సాగుతూ ఉంటుంది. అయితే కచేరి వద్ద ఉన్న ఒక బంటును జనక మహారాజు పిలుస్తారు. అప్పుడు ఆ బంటును ఒక విషయం అడుగుతాడు. అక్కడ నాట్యం ఆడే ఒక యువతి తప్పుగా నాట్యం చేసింది అని చెప్పగా.. అప్పుడు భటుడు నేను నాట్యం గురించి పట్టించుకోలేదు.. నా విధి వారికి రక్షణగా ఉండడం.. అని వినమ్రుడిగా సమాధానం ఇస్తాడు. అప్పుడు జనక మహారాజు వ్యాసమహర్షితో ఇదే విషయం అంటాడు. నేను ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలను అప్పజెప్పి పరిపాలిస్తాను. ఎవరి పనులు వారు చేస్తే మనపై ఒత్తిడి ఉండరు అని అంటాడు.
అలాగే మనుషులు కూడా కోరికలను అమితంగా చేసుకొని ప్రశాంతతను కోల్పోతున్నారు. ఒక పని చేయాలని అనుకుంటే కేవలం దానిపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలి. ఒక పని చేసుకుంటూ మరో పని గురించి ఆలోచిస్తే ఉన్న పని పూర్తి అయ్యే అవకాశం ఉండదు. అలాగే ఉద్యోగులు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం గురించి ఆలోచిస్తే వారు చేసే ఉద్యోగంలో ఎలాంటి విజయాలు సాధించారు. వ్యాపారులు సైతం అవసరమైన దానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించడం కోసం వ్యాపారాన్ని విస్తరిస్తే.. మనశ్శాంతి కోల్పోతారు. ప్రశాంతమైన జీవితం ఉండాలని అంటే కొన్ని కోరికలను చంపుకోవాలి. లేదా ఏదో ఒక పని పై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలి.