Home Cooked Food Dementia Prevention: ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో ఆహారాన్ని వదిలి బయట ఫుడ్ కు అలవాటుపడుతున్నారు. ఇంట్లో కంటే హోటళ్లలో లభించే ఆహారం రుచిగా ఉండడంతో చాలా మంది అటువైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఇలా రెడీమేడ్ ఫుడ్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా మంది వైద్యులు హెచ్చరించారు. అంతేకాకుండా ఇందులో వాడే ఆహార పదార్థాల్లో నాణ్యత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీటితో పాటు రేడీమేడ్ ఫుడ్ వల్ల వృద్ధుల్లో తీవ్ర మతిమరుపుకు దారితీసే Dementia ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, అదే ఇంట్లో వండిన ఆహారం తినడం వల్ల దీని తీవ్రతను తగ్గించుకోవచ్చని జపాన్ కు చెందిన వైద్యులు తమ పరిశోధనల ద్వారా తెలుపుతున్నారు. అసలు ఏంటీ ఈ డిమెన్షియా? దీని తీవ్రతను ఇంట్లో వండిన ఆహారంతో ఎలా తగ్గించుకోవచ్చు?
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
డిమెన్షియా అంటే?
Dementia అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు క్రమంగా తగ్గిపోవడం వల్ల వచ్చే ఒక తీవ్రమైన మతిమరుపు సంబంధిత సమస్య. ఇది సాధారణంగా పేర్లు, తేదీలు, చోట్లను మర్చిపోవడం నుంచి ప్రారంభమై, తరువాత రోజువారీ పనులు కూడా చేయలేని స్థితికి తీసుకెళ్లవచ్చు. ఒకే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడగడం.. మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకురాకపోవడం, పరిచయమైన ప్రదేశాల్లో కూడా దారి తప్పడం, డబ్బు లెక్కలు, సాధారణ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడడం వంటి లక్షణాలు ఉంటాయి.
జపాన్ ఆరోగ్య నిపుణుల తాజా పరిశోధన ప్రకారం.. బయట లభించే ఆహారం తినడం కంటే ఇంట్లో వండుకొని తినడం మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధుల్లో తీవ్ర మతిమరుపుకు దారితీసే Dementia ప్రమాదాన్ని తగ్గించడంలో ఇంటి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనలో సుమారు 11 వేల మంది వృద్ధుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించారు.
పరిశోధకుల ప్రకారం ఇంట్లో వండిన ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు. అలాగే కూరగాయలు, పప్పులు, చేపలు, ధాన్యాలు వంటి పోషకాహారం ఎక్కువగా చేరుతుంది. బయట ఆహారంలో ఉండే అధిక కొవ్వులు, ప్రాసెస్డ్ పదార్థాలు, రసాయనాలు మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
ఇంట్లో వంట చేసుకునే అలవాటు కేవలం ఆహారం విషయంలోనే కాదు, జీవనశైలిలో కూడా చురుకుదనాన్ని పెంచుతుంది. కూరగాయలు సిద్ధం చేయడం, వంట ప్రక్రియలో పాల్గొనడం, సమయానికి భోజనం చేయడం వృద్ధుల్లో మానసిక చైతన్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒంటరితనాన్ని తగ్గించి, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసే అవకాశాన్ని పెంచుతుంది.
అధ్యయనంలో ముఖ్యంగా రోజూ ఇంటి ఆహారం తీసుకునే వృద్ధుల్లో జ్ఞాపకశక్తి క్షీణించడం తక్కువగా కనిపించింది. వారిలో మెదడు పనితీరు స్థిరంగా ఉండటం, రోజువారీ పనులను స్వయంగా నిర్వహించే సామర్థ్యం మెరుగ్గా ఉండటం గమనించబడింది. బయట ఆహారం తరచుగా తీసుకునే వారిలో మాత్రం ఆరోగ్య సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గుదల కొంత ఎక్కువగా నమోదైంది.
నిపుణుల సూచన ఏంటంటే.. వయస్సు పెరిగే కొద్దీ ఆహారంపై మరింత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఇంట్లో తాజా పదార్థాలతో వండిన ఆహారం, తక్కువ ఉప్పు, తక్కువ నూనె, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపకరిస్తుంది. ఇంటి వంటలో ఉండే ప్రేమ, పరిశుభ్రత, నియంత్రిత పదార్థాలు కలిసి శరీరానికే కాదు మెదడుకూ రక్షణ కల్పిస్తాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది.