Health Tips: జీవనశైలిలో మార్పు అనేక రుగ్మతలకు కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని వైద్యులు పదేపదే చెబుతున్నారు. పూర్వపు జీవన శైలి సంపూర్ణ ఆరోగంతో పాటు ఆయుష్సు అందించింది. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం, మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి అనేక వ్యాధులకు కారణమవుతోంది. ఈ మార్పులతో మనం కూడా వ్యాధులను పరోక్షంగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం చాలా మంది రాత్రి 9 తర్వాతే భోజనం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తింటే పర్వా లేదు. కానీ, నిత్యం ఇలాగే తింటే ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. మనం ఆరోగ్యంగా ఉండేందుకు భోజన సమయం కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
బిజీలైఫ్‌తో…
సంపాదనపై పడిన నేటితరం.. ఉరుకులు పరుగల జీవితానికి అలవాటు పడింది. తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఈ లైఫ్‌స్టైల్‌లో తినడానికి కూడా తీరిక దొరకడం లేదు. బిజీ లైఫ్‌తో ఆకలి తీర్చుకునేందుకు ఏది దొరికితే అది తిని కడుపు నింపుకుంటున్నాం. అది ఆరోగ్యానికి ప్రమాదమని మాత్రం మర్చిపోతున్నాం.
9 తర్వాత భోజనం చేస్తే..
ఇక చాలా మంది రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం అలవాటుగా మారింది. రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 మధ్యలో ఎక్కువ శాతం భోజనం చేస్తున్నారు. ఇలా తినడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా తినడం వలన బరువు పెరుగుతారట. జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు వస్తాయట. ఆలస్యంగా తినే అలవాటు అనేక రోగాలకు కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణ శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. భవిష్యత్తులో స్ట్రోక్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రివేళ ఎక్కువగా తినడం వలన రక్తపోటు, షుగర్ లెవల్స్‌లో మార్పులు వస్తాయని సూచిస్తున్నారు. భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.