Dice Snakes: చాలా మంది పనులు తప్పించుకునేందుకు నటిస్తుంటారు. పిల్లలు స్కూల్‌కు డుమ్మా కొట్టేందుకు నటిస్తుంటారు. యువత కాలేజీకి బంక్ కొట్టేందుకు నటిస్తారు.. మనుషుల్లో ఇలాంటి నటులు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో నటిస్తారు. కానీ ఇక్కడ ఓ పాము మనుషులను నటిస్తుంది. అది కూడా ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్. ఇది ఎవరో చెప్పింది కాదు.. పరిశోధకుల అధ్యయనంలో గుర్తించింది. శత్రువల నుంచి తనను రక్షించుకోవడానికి మరణించినట్లు నటిస్తుందని పరిశోధనలో తేలింది. ఇక ఈ పాము రక్తం, దుర్వాసన కలిగి ఉంటుందట. మరి ఆ పాము ఏంటి.. ఎక్కడ ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం.
బయోలజీ లెటర్స్ జర్నల్ ప్రకారం..
బయోలజీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ఈ ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ పాము గురించి తెలియజేసింది. పాచికల పాములు లేదా డైస్‌స్నేక్ అనే ఈ నీటి పాము.. మరణించినట్లు నటిస్తూ తన ప్రాణాలు కాపాడుకుంటుందట. రక్షణ కోసం ఈ పాములు ఎంత దూరమైనా వెళ్తాయని అధ్యయనం వెల్లడించింది.
విష రహిత పాము..
డైస్ స్నేక్(నాట్రిక్స్ టెస్సెల్లాట).. ఇది యురేషియన్ జాతికి చెందిన విషరహిత పాము.. ఇది నాట్రిసినే అనే ఉప కుటుంబానికి చెందినది. దీనిని నీటిపాము అని కూడా పిలుస్తారు. నాట్రిక్స్ టెస్సెల్లాటా పాములు చాలా తెలివైనవని.. తమకు ముప్పు పొంచి ఉందని గ్రహిస్తే మరణించినట్లు నటిస్తాయట. ఇందుకోసం ‘‘నోటినిండా’’ రక్తం స్రవించడం, మలంతోపాటు.. దుర్వాసనతో కూడిన ద్రావణాన్ని విడుదల చేస్తాయట. తెలివితో ప్రాణాలు కాపాడుకునే ఈ పాములు ఆ తర్వాత వేరే వాటిపై దాడి చేస్తాయని అధ్యయనం తెలిపింది.
ఎక్కడ ఉంటాయంటే..
డైస్ స్నేక్స్ ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే అన్ని డైస్ స్నేక్స్ ఇలా తెలివి ప్రదర్శించవట. కొన్ని నిశ్చలంగా ఉంటాయని అధ్యయనం తెలిపింది. పరిశోధకులు అధ్యయనం చేసిన 263 డైస్ స్నేక్స్‌లలో 124 మలంతో దుర్వాసనతో కనిపించాయట. 28 బ్లడ్ వామ్టింగ్ చేసుకుంటున్నట్లు పరిశోధకులు గమనించారు. మొత్తంగా డైస్ స్నేక్స్ దాదాపు ఆరు నుంచి 24 సెకన్లపాటు చనిపోయినట్లు నటిస్తాయని గుర్తించారు. ఇలా నటించి ఎరను వేటాడతాయని కూడా పరిశోధన తెలిపింది.
ఈ పాముల ప్రవర్తన ఇలా..
ఆడ లేదా మగ పాముల్లో గాయాలు, శరీర ఉష్ణోగ్రత, పరిమాణం అనేవి పాముల వయస్సు, కడుపులో ఆహారం ఉండటం, ఆడ పాములలో గుడ్లు ఉండటం.. తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలిపింది. ఈ పాములు తీవ్రంగా పోరాడుతాయని.. అరుపు కూడా భయంకరంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు.