Afternoon Sleeping benefits: మనిషి ఆరోగ్యానికి నిద్ర ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కంటినిండా నిద్ర పోయేవారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. సరైన ఆహారం తీసుకుంటూ.. నిద్రపోతే నిత్యం యవ్వనంగా కూడా కనిపిస్తారు. అయితే చాలామంది మధ్యాహ్నం నిద్ర పోవద్దని.. అలా పోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉంటాయని చెబుతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం నిద్ర వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు ఉన్నాయని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనల ఫలితం ఏంటంటే?
University college of London వారు చేసిన తాజా పరిశోధనలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ యూనివర్సిటీ వాళ్లు మూడు లక్షల మంది నిద్రపై పరిశోధనలు చేశారు. రోజు లాగే సాయంత్రం నిద్రించి ఉదయం లేచే వారి కంటే.. మధ్యాహ్నం సమయం దొరికితే కాస్త కునుకు తీయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ ప్రయోజనాలు తక్షణమే కాకుండా దీర్ఘకాలంలో ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంట పాటు నిద్దిస్తే.. అతను 70 ఏళ్ల వయసు వచ్చేసరికి.. తన మైండ్ షార్ప్ గా పనిచేస్తుందని చెప్పారు. ఎందుకంటే 30 ఏళ్ల వయసులో అతను మెదడును ఎంతో రిలాక్స్గా ఉంచాడని.. అప్పుడు వచ్చిన శక్తి ఇప్పుడు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే మధ్యాహ్నం సమయం లేదని కొందరు రాత్రి ఆలస్యంగా పడుకొని.. ఉదయం 11 గంటలు అయితే గాని నిద్రలేవరు. ఇలా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. రాత్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా.. ఉదయం 6 గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలా ప్రతిరోజు సూర్యోదయానికి నిద్రలేస్తేనే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోయే ముందు అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. నిద్రపోయేముందు వీలైతే ధ్యానం చేయాలి.
ఇక మధ్యాహ్నం కార్యాలయాలకు వెళ్లేవారు నిద్రపోవడం ఎలా? అని కొందరు ప్రశ్నించవచ్చు. కార్యాలయాల్లో నిద్రపోవాలని చెప్పడం కాదు.. అవకాశం ఉన్నవారు మాత్రమే మధ్యాహ్నం నిద్రిస్తే ఎంతో ఆరోగ్యం ఉంటుందని అంటున్నారు. అయితే మధ్యాహ్నం బిజీ వాతావరణం లో గడిపిన వారు.. సాయంత్రం తొందరగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. రాత్రి ఇతర వ్యసనాలతో ఆలస్యంగా సమయం వృధా చేస్తే.. ఆ తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆఫీసులోనూ విశ్రాంతి సమయం ప్రత్యేకంగా ఇచ్చినట్లయితే.. ఈ సమయంలో నిద్రపోవడం చాలా బెటర్ అని అంటున్నారు. అయితే ఇది ఆఫీసు అవసరాలను బట్టి ఉండాలని చెబుతున్నారు.
ముఖ్యంగా యువత మధ్యాహ్నం సమయం దొరికితే కచ్చితంగా గంట పాటు నిద్రిస్తే మంచిదని.. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇలా మధ్యాహ్నం నిద్రపోతే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని చెబుతున్నారు. ఈ రకంగా నిద్ర గడియారాన్ని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో కూడా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.