Heart Attack: మనిషి ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా అవసరం అని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. బిజీ వాతావరణం కారణంగా ప్రస్తుత కాలంలో కొంతమంది సరైన నిద్ర పోవడం లేదు. అయితే నిద్రపోయినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో బెడ్ రూమ్ ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే మనసుకు హాయిగా ఉంటుంది. అంతేకాకుండా బెడ్ రూమ్ లో ఎలాంటి కాంతి లేకుండా ఉన్నప్పుడు నిద్రపోతేనే ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్యులు తెలుపుతున్నారు. తాజాగా JAMA Network Open స్టడీలో తెలిపిన ప్రకారం నిద్రించే గదిలో కాంతి ఉండడం వల్ల గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
JAMA Network Open ప్రచురించిన ప్రకారం.. నిద్రపోతున్నప్పుడు గదిలో వెలుతురు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తన పరిశోధనలో తేల్చింది. రాత్రి సమయంలో ప్రకాశవంతమైన కాంతి ఉండడం వల్ల గుండె వైపల్యం ఎక్కువగా ఉంటుందని.. ఈ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. Plinders విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరిగిన ఈ అధ్యాయనం JAMA Network Open లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భాగంగా UK లోని 89,000 మంది వ్యక్తుల నుంచి డేటా సేకరించారు.. రాత్రి సమయంలో కాంతి ఉన్నప్పుడు నిద్రపోతే వీరి గుండె ఎలా స్పందిస్తుందో కనుగొన్నారు. చేతికి సెన్సార్లను ఏర్పాటు చేసి డేటాను కనుగొన్నారు. మొత్తం 13 మిలియన్ గంటలకు పైగా కాంతి పడితే వీరి గుండె ఎలా ప్రభావితం అవుతుందో కనుగొన్నారు. ప్రకాశవంతమైన కాంతి లో నిద్రపోయే వారి గుండె ఆగిపోయే ప్రమాదం 56% ఉన్నట్లు గుర్తించారు. అలాగే 47% మందికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేల్చారు. అయితే వీరు వ్యాయామం, సరైన ఆహారం, నిద్ర గడియారం వంటి పద్ధతులను పాటించినా కూడా నిద్రపోయే సమయంలో కాంతి ఉంటే ప్రమాదాలు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.
అలాగే Plindwrs విశ్వవిద్యాలయం పరిశోధకుడు డేనియల్ విండ్రేడ్ మాట్లాడుతూ ఈ అధ్యాయం చాలామందికి హెచ్చరిక అని తెలిపారు. రాత్రిపూట కాంతి లో నిద్రపోవడం వల్ల గుండెకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితిలో గదిలో కాంతి లేకుండా చూడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా నిద్రపోయే 30 నిమిషాల ముందు కళ్ళకు కాంతి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని.. టీవీ స్క్రీన్ లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ విషయంలో మహిళలు, యువత ఎక్కువగా ప్రభావానికి గురవుతారని పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా సున్నితమైన మనస్తత్వంతో ఉంటారు.. అయితే వారు నిద్రపోయే సమయంలో కాంతి ఉండడం వల్ల మానసిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ సమస్యలు కొన్ని రోజుల తర్వాత గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. రోజువారి అలవాట్లలో భాగంగా నిద్రపోయే సమయంలో గదిలో ఎలాంటి కాంతి లేకుండా చూసుకోవాలని తెలిపారు.
