నెయ్యిలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీ నెయ్యి ఆహారానికి రుచితో పాటు మృదుత్వాన్ని కూడా జోడిస్తుందనే విషయం తెలిసిందే. అయితే కొంతమంది నెయ్యి తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని భయపడతారు. అయితే నెయ్యి వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి.
ఆవుపాలతో తయారయ్యే నెయ్యి పసుపు రంగులో, గేదె పాలతో తయారయ్యే నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు నెయ్యిలో పసుపు నెయ్యితో పోలిస్తే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గేదె నెయ్యిలో శరీరానికి అవసరమైన ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఆవు నెయ్యి బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలతో పాటు పెద్దలలో స్థూలకాయంను ఆవునెయ్యి ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు.
గేదె నెయ్యిలో లభించని కొన్ని ప్రోటీన్లు సైతం ఆవు నెయ్యి ద్వారా లభిస్తాయి. గుండె బాగా పని చేయడానికి ఆవునెయ్యి ఎంతగానో తోడ్పడుతుంది. ఆవునెయ్యి గుండె బాగా పని చేసేలా చేయడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో ఆవు నెయ్యి, గేదె నెయ్యి తోడ్పడుతుంది.
ఆవు నెయ్యి ద్వారా లభించే విటమిన్ ఎ, కెరోటీన్ వల్ల మెదడు పనితీరుతో పాటు కంటి పనితీరు సైతం మెరుగుపడుతుంది. ఆవునెయ్యి జీర్ణక్రియకు మేలు చేయడంతో పాటు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆవు నెయ్యి వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంతో పాటు జలుబు, దగ్గు, కఫ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.