
మనలో చాలామంది చిన్నచిన్న అనారోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. దీంతో ఆ చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద అనారోగ్య సమస్యలుగా మారి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడతాయి. అల మనం నిర్లక్ష్యం చేసే అనారోగ్య సమస్యల్లో చెవిలో రక్తం కారే సమస్య ఒకటి. ఈ సమస్యను తేలికగా భావిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో సాధారణంగానే చెవి నుంచి రక్తం కారినా చాలా సందర్భాల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రమే ఆ విధంగా జరుగుతుంది. చెవిలో నుంచి రక్తం కారడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఎవరికైనా తలపై బలమైన దెబ్బ తగిలితే చెవిలో నుంచి రక్తం కారే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్య ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
మన చెవి భరించలేనంత ధ్వనిని విన్న సమయంలో కూడా చెవి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. లౌడ్ స్పీకర్ల శబ్దాలు విన్నా, పేలుళ్ల శబ్దాలు విన్నా ఈ విధంగా జరుగుతుంది. ఆ సమయంలో చెవిలోని కర్ణభేరిపై ఒత్తిడి పెరిగితే చెవి నుంచి రక్తం కారుతుంది. చెవిలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చర్మం పగిలినా కూడా రక్తం కారే అవకాశం ఉంటుంది. అయితే చర్మం పగలి రక్తం కారితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగవు.
ఇవి కాకుండా చెవిలో పుండ్ల వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, పురుగులు చెవిలో దూరడం వల్ల, క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడటం వల్ల కూడా చెవిలో రక్తం కారే అవకాశాలు ఉంటాయి. చెవికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా వైద్యులను వెంటనే సంప్రదించడం మంచిది. సొంత వైద్యం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలు ఉన్నాయి.