Idli: ఇడ్లి అంటే మనలో చాలామందికి ఇష్టం. చాలామంది దైనందిన జీవితం ఇడ్లీతోనే ప్రారంభమవుతుంది. వేడి వేడి ఇడ్లీ, అందులో చట్నీ, పొగలు కక్కే సాంబార్.. ఈ కాంబినేషన్ ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఇక మనదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో రకరకాల ఇడ్లీలు తయారు చేస్తుంటారు. తమిళనాడులో కుడుం ఇడ్లీ, కర్ణాటకలో తట్ట ఇడ్లీ, కేరళలో కొబ్బరి నూనె అద్ది తయారుచేసిన ఇడ్లీ, తెలుగు రాష్ట్రాల్లో మినప, తృణ ధాన్యాల ఇడ్లీలు ఫేమస్.. అయితే ఈ ఇడ్లీ వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందట? అదేంటి ఆవిరి మీద ఉడికే ఇడ్లీ వల్ల ఇంతటి ప్రమాదం ఉంటుందా? అంటే దీనికి అవును అనే సమాధానం చెబుతున్నారు కొంతమంది నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే 151 వంటకాలపై కొంతమంది పరిశోధకులు పరిశీలన జరిపారు. అయితే ఈ పరిశోధనలో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు వాటిలినట్టు తేలిందట.
భారతీయులు ఎక్కువగా తినే ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహ పలు పదార్థాలపై సంస్థ అధ్యయనం చేసింది. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయని వాటి పరిశీలనలో తేలింది. ముఖ్యంగా శాఖాహార వంటలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవ వైవిధ్యం పై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయని పరిశోధకుల పరిశీలనలో తేలింది. అయితే ఇందులో కొంతలో కొంత సాంత్వన కలిగించే విషయం ఏంటంటే.. మన వంటకాలలో బియ్యం, పప్పు ధాన్యాల వాడకం ఎక్కువ. పైగా భారతీయుల్లో చాలామంది శాకాహారులు కావడం వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం పెద్దగా లేదని పరిశోధకులు చెబుతున్నారు. బ్రెజిల్ దేశంలో ఉపయోగించే పశువుల మాంసం, స్పెయిన్ దేశానికి చెందిన రోస్ట్ లాంబ్ డిష్, బ్రెజిల్ దేశానికి చెందిన లెచావో వంటి ఆహార పదార్థాలు జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం కలిగించేవని పరిశోధకుల పరిశీలనలో తేలింది.. అయితే చాలామంది ఎక్కువగా ఇష్టపడితేనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ పరాటా, దోశ, బోండా వంటివి జీవ వైవిధ్యానికి తక్కువ ముప్పు తెస్తాయని పరిశీలనలో తేలింది. అయితే ఈ అధ్యయనం జీవ వైవిధ్యం పై నెలకొన్న ఒత్తిడిని వివరిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. 25 రకాల ఆహార పదార్థాలు పర్యావరణం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కర్గో కీలక పాత్ర పోషించారు. “ప్రతీ వంటకాన్ని మనుషులు ఇష్టంగా తింటారు. ప్రాంతాల ఆధారంగా వివిధ రకాలైన వంటకాలు ఏర్పడ్డాయి. కాకపోతే ఈ పదార్థాలు పరోక్షంగా జీవ వైవిధ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి. అవి అడవి జాతులు, క్షీరదాలు, పక్షులు, ఉభయచరాల గమనంపై ప్రభావం చూపుతాయని” ఆయన వివరించారు.