Homeహెల్త్‌Tea For Weight Loss: టీ, కాఫీలు తాగితే బరువు తగ్గుతారా.. ఎలా తీసుకోవాలి..

Tea For Weight Loss: టీ, కాఫీలు తాగితే బరువు తగ్గుతారా.. ఎలా తీసుకోవాలి..

Tea For Weight Loss: కాఫీ, టీలు ఆరోగ్యానికి మంచివి కావని చాలామంది భావిస్తారు. అయితే తాజా అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, టీని సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు నియంత్రణలో సహాయపడే అవకాశం ఉందని.. అందులోనూ టీ తాగే సమయం, అందులో కలిపే పదార్థాలు, అలాగే దానికి తోడు తీసుకునే ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అసలు టీ తాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? టీ లేదా కాపీని ఏ యే పద్ధతిలో తీసుకోవాలి?

చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ నిపుణుల ప్రకారం నిద్రలేచిన తర్వాత కనీసం 60 నుంచి 90 నిమిషాల వరకు కెఫీన్ ఉన్న పానీయాలను తీసుకోకపోవడం మంచిది. ఈ సమయంలో శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగానే అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఇది మనల్ని మెలకువగా ఉంచడంతో పాటు రోజంతా ఎదురయ్యే ఒత్తిడులను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉన్న వారిపై నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నిద్రలేచిన మొదటి గంటన్నరలోనే టీ తాగినవారిలో కొద్దిసేపటికే శక్తి స్థాయులు తగ్గడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. కార్టిసాల్ స్థాయులు సహజంగా పెరిగే సమయంలో అదనంగా కెఫీన్ తీసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉండొచ్చని వారు చెబుతున్నారు.

అయితే లేచిన గంటన్నర తర్వాత టీ తాగినవారిలో మాత్రం కెఫీన్ ప్రభావం మరింత సమర్థంగా పనిచేసినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీరిలో చురుకుదనం పెరగడం, ఏకాగ్రత మెరుగుపడటం, ఆకలి కొంత మేర తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. ఆకలి నియంత్రణలో ఉండటం వల్ల అనవసరంగా ఎక్కువ తినే అలవాటు తగ్గి, బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.

టీని చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తీసుకుంటే అందులో కెలోరీలు చాలా తక్కువగా ఉంటాయి. పండ్ల రసాలు, కొన్ని రకాల కాఫీ పానీయాల్లో చక్కెర, క్రీమ్, ఇతర పదార్థాల వల్ల కెలోరీలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పోలిస్తే సాధారణ టీ బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు టీలో అధిక కొవ్వులు ఉండే పూర్తి కొవ్వు పాలను ఉపయోగించకుండా బాదం పాలు వంటి తక్కువ కెలోరీల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో టీ రుచి తగ్గకుండా కెలోరీల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. టీ తాగుతున్నామనే కారణంతో పాటు బిస్కెట్లు, చిప్స్, సమోసాలు, ఇతర అధిక కెలోరీల చిరుతిళ్లు తీసుకుంటే బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి టీతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, సరిపడ నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలని అనుకునేవారు టీ ఒక్కటే అద్భుత ఔషధం కాదు. అయితే సరైన సమయంలో, సరైన విధంగా తీసుకుంటే ఆకలి నియంత్రణ, చురుకుదనం పెంపు, తక్కువ కెలోరీల వినియోగం వంటి ప్రయోజనాల ద్వారా బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. అందుకే ఉదయం లేవగానే కాకుండా కొంత సమయం తర్వాత టీ తాగడం, చక్కెరను తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version