
ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా హోటల్ లో భోజనం చేయాలంటే 80 నుంచి 100 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్, లాక్ డౌన్ లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. కొత్త ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మహానగరాల్లో నివశిస్తూ తినడానికి తిండి లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి దొరికినా పనికి తగిన వేతనం లభించకపోవడం వల్ల కొంతమంది ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కొనే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఢిల్లీలోని ఒక ఫుడ్ స్టాల్ మాత్రం ఒక్క రూపాయికే థాలిని అందిస్తోంది. ఈ ఫుడ్ స్టాల్ వల్ల వేల సంఖ్యలో ప్రజలు కడుపు నిండా తింటున్నారు. రూపాయికే ఇస్తున్నప్పటికీ ఈ థాలి ఎంతో రుచిగా ఉంటుందని తిన్నవాళ్లు చెప్పడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే శ్యామ్ రసోయి అనే పేరుతో ఢిల్లీలోని నాంగ్లోని శివుని దేవాలయం సమీపంలో ఒక ఫుడ్ స్టాల్ ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు పడుతున్న వారి కోసం రూపాయికే థాలి అందించాలని నిర్ణయం తీసుకున్నామని శ్యామ్ రసోయి ఫుడ్ స్టాల్ యాజమాన్యం చెబుతోంది. ఫుడ్ స్టాల్ ద్వారా రోజూ ఉదయం ఉదయం 11 నుంచి 1 మధ్య 1,000 మందికి భోజనం అందిస్తారు.
ఈ సందర్భంగా షాప్ యజమాని గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని నామమాత్రపు ధరకే రుచితో కూడిన భోజనం అందిస్తున్నామని.. ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చి 1000 మంది ఆహారం తీసుకుంటారని మరో 1000 మందికి ఈ రిక్షాల సహాయంతో ఆహారం డెలివరీ చేస్తామని తెలిపారు.