Daily protein requirement: మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనంగా కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే ఇందులో ప్రోటీన్లు ఉండడం చాలా అవసరం. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు సుమారు 70 నుంచి 80 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ప్రొటీన్ మన కండరాల నిర్మాణానికి మాత్రమే కాదు.. హార్మోన్లు, ఎంజైమ్స్ తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇది ప్రతి ఒక్కరి డైట్లో తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ ప్రోటీన్ ను ఎలాంటి ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు?
ప్రోటీన్స్ అనగానే చాలా మంది మాంసం తీసుకోవాలని అనుకుంటారు. కానీ శాకాహారులు కూడా సులభంగా ప్రొటీన్ అవసరాన్ని తీర్చుకోవచ్చు. పప్పులు, సోయా, పనీర్, గ్రీక్ యోగర్ట్, బాదం వంటి ఆహారాలు మంచి ప్రొటీన్ సోర్స్‌లు. ఇవి కేవలం ప్రొటీన్ మాత్రమే కాదు, ఫైబర్, కాల్షియం, మంచి కొవ్వులు కూడా అందిస్తాయి. రోజువారీ భోజనంలో ఇవి చేర్చుకుంటే శరీరానికి సమతుల ఆహారం అందుతుంది.
మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్ బ్రెస్ట్, చేపలు వంటి ఆహారాల ద్వారా అధిక ప్రొటీన్ పొందొచ్చు. ముఖ్యంగా గుడ్లు ‘కంప్లీట్ ప్రొటీన్’గా భావిస్తారు, ఎందుకంటే ఇవి అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటాయి. చికెన్ బ్రెస్ట్, చేపలు తక్కువ కొవ్వుతో ఎక్కువ ప్రొటీన్ అందిస్తాయి, కాబట్టి ఫిట్‌నెస్‌కు ఇవి చాలా ఉపయోగకరం.
ఎలాంటి ప్రొటీన్ ఆహారం తీసుకుంటున్నామనేది కాకుండా ఏ సమయంలో తీసుకుంటున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే సుమారు 25 నుంచి 30 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే రోజంతా శక్తిగా.. యాక్టివ్‌గా ఉండొచ్చు. ఇది ఆకలి నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఉదయం సరిపడా ప్రొటీన్ తీసుకుంటే మధ్యలో జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది.
మధ్యాహ్నం, రాత్రి భోజనంలో కూడా ప్రొటీన్ సోర్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక్కో భోజనంలో చిన్న పరిమాణంలో అయినా ప్రొటీన్ తీసుకుంటే అది శరీరానికి మెరుగైన శోషణ కలిగిస్తుంది. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం కంటే రోజంతా విభజించి తీసుకోవడం ఉత్తమం.
స్నాక్స్‌లో కూడా ప్రొటీన్ చేర్చుకోవడం మంచి అలవాటు. బాదం, పల్లీలు, గ్రీక్ యోగర్ట్, బాయిల్డ్ ఎగ్స్ వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకుంటే రోజువారీ ప్రొటీన్ టార్గెట్‌ను సులభంగా చేరుకోవచ్చు. ఇవి తక్కువగా తిన్నా ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి. ప్రతి రోజుకు 70 నుంచి 80 గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి బేసిక్ అవసరం. సరైన ఆహార పదార్థాలను ఎంచుకుని, రోజంతా సమతులంగా తీసుకుంటే శరీరం ఫిట్‌గా, ఎనర్జీతో నిండుగా ఉంటుంది.
