Covid 19: ఒక వ్యక్తిలో 613 రోజులపాటు కోవిడ్.. ఎలా సాధ్యం? చివరికి ఏమైంది?

కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ, వైరస్ సంక్రమణం ఏదో ఒక రూపంలో ఉంటున్నదని ఇటీవల పలు అధ్యయనాలలో తేలింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఏదో ఒక లక్షణం బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 9:34 am

Covid 19

Follow us on

Covid 19: కోవిడ్.. ఈ మహమ్మారి వల్ల రెండు నుంచి మూడు సంవత్సరాలపాటు ప్రపంచం మొత్తం వణికింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చైనా దేశంలో ఈ వ్యాధి ముందుగా బయటపడింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ వ్యాధి బయటపడిన మొదటి సంవత్సరం ఒకరకమైన వేరియంట్.. మరుసటి సంవత్సరం మరొక వేరియంట్ .. ఆ తదుపరి సంవత్సరం ఇంకొక వేరియంట్ ల వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. లక్షల మంది చనిపోయారు. అంతకుమించిన రెట్టింపు సంఖ్యలో ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఇంకా కొంతమందైతే ఆ వ్యాధికి సంబంధించి ఏదో ఒక రుగ్మత తో బాధపడుతూనే ఉన్నారు. అప్పట్లో కోవిడ్ కు సంబంధించి తీసుకున్న వ్యాక్సిన్ ల వల్ల కొంతమందిలో దానికి సంబంధించిన దుష్పరిణామాలు వెలుగు చూస్తున్నాయని, ప్రస్తుతం గుండెపోటు తాలూకూ మరణాలు వాటివల్లే అని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. వారి వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వయసు తారతమ్యం లేకుండా చాలామంది గుండెపోటు మరణాలకు గురవుతున్నారు.

కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ, వైరస్ సంక్రమణం ఏదో ఒక రూపంలో ఉంటున్నదని ఇటీవల పలు అధ్యయనాలలో తేలింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఏదో ఒక లక్షణం బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ వైరస్ కు సంబంధించి మూడు సంవత్సరాల పాటు రకరకాల వేరియంట్ లక్షణాలు బయటకి కనిపించాయి.. అందులో రెండవ దశ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా మరణాలకు కారణమైంది. మూడో వేరియంట్ లో భారీగా మరణాలు చోటు చేసుకున్నప్పటికీ చాలామంది అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతం కోవిడ్ ముగిసిందనుకుంటున్న తరుణంలో.. నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి శరీరంలో 613 రోజుల పాటు కోవిడ్ లక్షణాలు ఉన్నాయట. వాస్తవానికి కోవిడ్ లక్షణాలు కొద్ది రోజులకు మించి ఉండవు. చివరికి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలోనూ ఆ లక్షణాలు ఎక్కువ రోజులు ఉండవు. కానీ నెదర్లాండ్ దేశానికి చెందిన ఓ 72 సంవత్సరాల వృద్ధుడి శరీరంలో 613 రోజులపాటు కోవిడ్ లక్షణాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలం వైరస్ ఉన్నది ఇతడి శరీరంలోనేనని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ వృద్ధుడు గత ఏడాది చనిపోయాడు. చనిపోయే సమయానికి అతని శరీరంలో దాదాపు 50 సార్లు కోవిడ్ వైరస్ మ్యుటేషన్ అయ్యింది. రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అతడు అన్నిసార్లు వైరస్ మ్యూటేషన్ కు గురైనట్టు తెలుస్తోంది. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేని వ్యక్తులపై వైరస్ దాడి చేస్తుందని.. వారి శరీరాలను ఆవాసాలుగా చేసుకొని పరివర్తన చెందుతుందని పరిశోధకులు అంటున్నారు. అలాంటివారు జాగ్రత్తగా ఉండాలని.. కొవిడ్ తగ్గిపోయిందని భావించొద్దని… కచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.