మధుమేహంతో బాధ పడుతున్న వారు, ఒక డోస్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వారు ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతుండటం గమనార్హం. విజయవాడకు చెందిన వైద్య నిపుణులు బ్లాక్ ఫంగస్ బాధితులపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. దీర్ఘకాలంగా బీపీ, షుగర్ తో బాధ పడుతున్న వాళ్లు డయాలసిస్ చేయించుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటే మంచిది.
బ్లాక్ ఫంగస్ బారిన పడిన వాళ్లలో 298 మంది ఒక డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని వారు కాగా ఇద్దరు మాత్రం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన 200 మందిలో కంటి సమస్యలు వచ్చాయి. వీళ్లలో కంటి పక్కనే ఫంగస్ కనిపించిందని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారిలో 30 మందికి మెదడు వరకు ఫంగస్ వ్యాపించగా 70 మందికి దవడలు, పళ్ల దగ్గర ఫంగస్ ను గుర్తించినట్టు సమాచారం.
బ్లాక్ ఫంగస్ బారిన పడిన 300 మంది షుగర్ తో బాధ పడుతుండగా వీళ్లలో ఎక్కువమంది స్టెరాయిడ్స్ వాడారని సమాచారం. బాధితులలో ఎక్కువమంది పేదలు కాగా వీళ్ల శరీరంలొ ఐరన్ శాతం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.