
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి పలు రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. విద్యాసంస్థలు ఓపెన్ కావడంతో విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో పలు రాష్ట్రాల్లో అధికారులు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఐఐటీ చెన్నైలో కరోనా మహమ్మారి విజృంభించింది.
ఒకవైపు త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. చెన్నై ఐఐటీలో ఏకంగా 66 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 71 మందికి కరోనా నిర్ధారణ కాగా అందులో 66 మంది విద్యార్థులు మిగిలిన వాళ్లు సిబ్బంది కావడం గమనార్హం.
స్వయంగా ఐఐటీ అధికారులే విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడినట్లు ప్రకటన చేశారు. మొత్తం యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులు ఉన్నారు. ఏకంగా 71 మందికి కరోనా నిర్ధారణ అవడంతో ఆ క్యాంపస్ అంతటా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. అధికారులు విద్యార్థులు, సిబ్బంది హాస్టల్ గదులకే పరిమితం కావాలని.. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచనలు చేశారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యాపకులు, ఇతర ఉద్యోగులు క్యాంపస్ లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇంటినుంచి పని చేయనున్నారు.