Burning Earth: భూ గ్రహం మండిపోతోంది. భూమికి ఉపగ్రహమైన చంద్రుడు చల్లని వెన్నెల పంచుతుంటే ఈ భూమి మాత్రం సూర్యుడితో పోటీపడుతోంది. ఈ గ్రహం రోజురోజుకు వేడెక్కి పోతోంది. ఎంతగా అంటే.. మానవులు భరించలేనంతగా. ఎందుకని? ఈ పరిస్థితికి కారణాలేంటి? సహజంగా తలెత్తే ప్రశ్నలివి. మార్చి నెల ప్రారంభంలో అంటార్కింటిక్ వాతావరణ కేంద్రాల నుంచి ఉష్ణోగ్రతల రీడింగులు రావడం ప్రారంభమైనప్పుడు వాటిని చూసి కలవరపడ్డ శాస్త్రవేత్తలు తొలుత ఏదో పొరపాటు జరిగిందని భావించారు. దక్షిణ ధ్రువం వద్ద వేసవి క్రమంగా క్షీణిస్తున్న వేళ వేగంగా చల్లబడాల్సిన ఉష్ణోగ్రతలు అందుకు విరుద్ధంగా పెరుగుతుండడం వారిని ఆశ్చర్యపరిచింది. భౌగోళిక దక్షిణ ధృవం నుంచి 800 మైళ్ల దూరంలో ఉన్న వోస్టాక్ స్టేషన్‌లో మునుపటి ఆల్‌టైం రికార్డు కంటే 15 సెంటీగ్రేడ్ల ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే టెర్రాలో నోవా తీర ప్రాంత స్థావరంలో నీరు గడ్డకట్టే స్థాయికి మించి ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితిని తామెప్పుడు చూడలేదని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తర ధ్రువం వద్ద కూడా ఇలాంటి అసాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండడం గమనార్హం. దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈ ప్రాంతంలో 3 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.
Earth
విపత్తేనా?
సాధారణంగా ఒక ధ్రువం వద్ద ఉష్ణగాలులు వీస్తే ఓ హెచ్చరికగా పరిగణిస్తారు. అయితే, రెండు ధ్రువాల వద్ద ఒకేసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే దానిని విపత్తు అనే అనుకోవాలని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లో గ్లోబల్ మెక్సికన్ వేవ్‌లా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చిలోనే ఇండియా, పాకిస్థాన్‌ను వేడిగాలులు తాకాయి. 122 సంవత్సరాల క్రితం రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం అదే తొలిసారి. ఉపఖండం మొత్తం ఇలాంటి వాతావరణమే ఉంది. అమెరికాలోనూ వసంతకాలం కాస్తా మిడ్ సమ్మర్‌గా మారిపోయింది. ఇక, మేలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి. స్పెయిన్, యూకే సహా యూరప్ అంతా ఇదే పరిస్థితి ఉంది. ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు సహజంగా సంభవించినవని కాదని శాస్త్రవేత్తలు నిరూపించగలిగారు. గత నెలలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. వాతావరణంపై మానవ ప్రభావం వల్ల దక్షిణాసియాలో వేడిగాలులు సంభవించే అవకాశం 30 రెట్లు ఎక్కువ.
ఆరోగ్యానికి ముప్పు
గ్రీన్ హౌస్ ఉద్గారాలను యథేచ్ఛగా వాతావరణంలోకి డంప్ చేస్తుండడం వల్ల ఒక్క యూరప్‌లోనే ఉష్ణ గాలుల ఫ్రీక్వెన్సీలో 100 రెట్లకుపైగా పెరిగినట్టు గ్రంథమ్ ఇనిస్టిట్యూట్, ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో క్లైమేట్ సైన్స్ సీనియర్ లెక్చరర్ ఫ్రైడెరిక్ ఒట్టో తెలిపారు. ఉష్ణోగ్రతల్లో ఈ విధమైన వేడి మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. పంటలనూ దెబ్బతీస్తోంది. మనం నిర్మించే రోడ్లు, భవనాలు వంటి వాటి వల్ల కూడా పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతోంది. దీనికి ఎయిర్ కండిషనింగ్ కూడా తోడైంది. ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తుండడం వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు గాల్లోకి విడుదలై ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి.
Also Read: Allu Arjun Pushpa 2: సుకుమార్ కూడా అదే చేస్తే… కెజిఎఫ్ కి పుష్పకి తేడా ఏముంది?
ప్రత్యామ్నాయాలు..
ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు చాలా మార్గాలున్నాయి. వేడి దేశాల్లో సూర్యకిరణాలను ప్రతిబింబించేలా పైకప్పులకు తెల్లని పెయింట్ వేయడం, సమశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో గోడలపై ఐవీలను పెంచడం, నీడ కోసం చెట్లు నాటడం, ఎక్కువ ప్రదేశాలను పచ్చగా ఉంచడం వంటివి ఇందుకు సాయపడతాయి. అలాగే, భవనాలు, రవాణా నెట్‌వర్క్‌లు, ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాల కోసం మనం ఉపయోగించే పదార్థాలను మార్చడం కూడా వీటిల ఒకటి. అయితే, ఇవన్నీ కొంతవరకు మాత్రమే. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా మాత్రమే ఈ విపత్తు నుంచి బయటపడొచ్చు.
ఆ ఉష్ణోగ్రతలు సాధారణం..
ఇక, మన దేశం విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేనంత వేడి ఈసారి ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం సాధారణ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే అసాధారణంగా భావించేవారు. కానీ ఇప్పుడు సాధారణం అయిపోయాయి. దీంతో వేడి నుంచి తప్పించుకునేందుకు ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా ఊహించని విధంగా విద్యుత్ వినియోగం పెరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల బయట పనిచేసేవారు అంటే.. నిర్మాణరంగ కూలీలు, ఆటోవాలాలు, సెక్యూరిటీగార్డులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. పండ్లు, కూరగాయలు, పువ్వులు విక్రయించే వీధి వ్యాపారులు తమ ఉత్పత్తులపై నిరంతరం నీటిని చల్లుతూ నీడ కోసం తాత్కాలిక గుడారాల కింద ఆశ్రయం పొందుతున్నారు. దేశంలో హీట్‌వేవ్ పరిస్థితులు మార్చి నుంచే ప్రారంభమయ్యాయి. వేసవి ప్రారంభమైన తర్వాత 25 రోజుల్లోనే ఢిల్లీలో 42 డిగ్రీల సెంటీగ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 122 సంవత్సరాల తర్వాత మార్చిలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ నిపుణులు ఊహించినట్టుగా ఇప్పటికే పంట నష్టం జరిగింది. ‘వీట్ బౌల్’ అయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సమీప రాష్ట్రాల్లో గోధుమ పంటలో 15 నుంచి 35 శాతం దెబ్బతిన్నట్టు అంచనా.
Also Read: Janasena Alliance: జనంతోనే పొత్తు.. బీజేపీ, టీడీపీకి షాకిచ్చిన పవన్ కళ్యాణ్