Acidity : మీ కడుపు మంటను ఇలా చల్లార్చుకోండి

Acidity గుండెల్లో ఎప్పుడూ ఒక కుంపటి రగులుతూ… తరచూ మంటలు రేగుతుంటే ఏ మనిషికి మాత్రం సుఖం ఉంటుంది? జీవితం అనుక్షణం నరకంలా, ఏమీ తోచని అయోమయంలా మారిపోతూ ఉంటుంది.. ఏం తినాలన్నా భయం. ఏం తాగాలన్నా బెరుకు. తిన్న దగ్గర నుంచి ఒకటే తేన్పులు. గుండెల్లో మంట.. గొంతులో పుల్లటి భావన.. ఛాతి మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. ఈ చెప్పుకోలేని బాధల చిట్టా చాలా పెద్దది. మన సమాజంలో ఎంతమంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య ఇది. […]

Written By: Bhaskar, Updated On : November 5, 2022 5:41 pm
Follow us on

Acidity గుండెల్లో ఎప్పుడూ ఒక కుంపటి రగులుతూ… తరచూ మంటలు రేగుతుంటే ఏ మనిషికి మాత్రం సుఖం ఉంటుంది? జీవితం అనుక్షణం నరకంలా, ఏమీ తోచని అయోమయంలా మారిపోతూ ఉంటుంది.. ఏం తినాలన్నా భయం. ఏం తాగాలన్నా బెరుకు. తిన్న దగ్గర నుంచి ఒకటే తేన్పులు. గుండెల్లో మంట.. గొంతులో పుల్లటి భావన.. ఛాతి మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. ఈ చెప్పుకోలేని బాధల చిట్టా చాలా పెద్దది. మన సమాజంలో ఎంతమంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య ఇది. ఇంకా చెప్పాలంటే మధుమేహం, హై బిపి, గుండె జబ్బుల కంటే కూడా ఎక్కువగా విస్తరించి పోయిన అతిపెద్ద బాధ ఇది. ఒకప్పుడు దీనికి ఏవేవో చిట్కా వైద్యాలూ, యాంటాసిడ్ మాత్రలూ తప్పించి పెద్దగా పరిష్కారలేవీ ఉండేవి కాదు. కానీ పీపీఐ రకం కొత్త తరం మందుల రాకతో ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. అనాదిగా బాధిస్తున్న అసిడిటీ ని దాదాపు జయించేశామన్న చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ మాత్రలు వేసుకుంటున్నంతకాలం బాధలు ఉండవు.. కాబట్టి వాటిని దీర్ఘకాలం వాడుతూనే ఉండాలి.. ఇవి సురక్షితమే అయినప్పటికీ ఎక్కడో ఒకరిద్దరికి వీటివల్ల దుష్ప్రభావాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్మ్స్ పేరుతో జపాన్ పరిశోధకులు ఆవిష్కరించిన తేలికపాటి ఎండోస్కోపీ చికిత్స విధానంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

-ఆమ్లం ఎగదన్నుకొని రావటం వల్లే

అబ్బా అసిడిటీ చంపేస్తోంది. కొంచెం తినగానే కడుపు ఉబ్బరం.. గుండెల్లో ఒకటే మంట.. పుల్లటి తేన్పులు… ఇలాంటి లక్షణాలతో నిత్యం వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్యకు అంతు ఉండటం లేదు.. ఈ బాధలు అన్నీ ఇన్ని కావు.. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. ఇక అక్కడి నుంచి బాధలు మొదలవుతాయి.. సరిగా నిద్ర పట్టదు.. కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా ఉండి గుండె నొప్పిగానూ అనిపిస్తూ ఉంటుంది. అంతలా వేధించే ఈ అసిడిటి బాధ ను స్థూలంగా చెప్పాలంటే మనం నోటితో తీసుకున్న ఆహారం.. గొంతు దాటి అన్నవాయిక అనే పొడవాటి గొట్టం గుండా కిందికి ప్రయాణించి కింద పెద్ద సంచిలా ఉండే జీర్ణాశయంలోకి వెళుతుంది. అలా ఆహారం కిందికి ప్రయాణించడమే గాని కింది నుంచి మళ్లీ పైకి అంటే గొట్టంలోకి రాకుండా గొట్టం చివర బలమైన కండర కవాటం ఉంటుంది. అది ఆహారాన్ని కిందికి పంపిస్తుంది. కిందికి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా గట్టిగా మూసేసుకుంటుంది.. కింద జీర్ణాశయంలో తిన్న ఆహారం జీర్ణం చేసేందుకు 1.5 లీటర్ల పరిమాణంలో రకరకాల జీర్ణ రసాలు, గాడమైన ఆమ్లం వంటివన్నీ ఉంటాయి.. ఈ ఆముదం ఎంత గాడమైనదైనా అది జీర్ణాశయంలో ఉన్నంతవరకు మనకు ఎటువంటి బాధ ఉండదు. అయితే కొందరిలో ఆ కండర కవాటం బలహీనపడి జీర్ణాశయం నుంచి ఈ ఆమ్లం పైకి అన్నవాహిక గొట్టంలోకి ఎగదన్నుకొని వస్తూ ఉంటుంది. దీంతో ఛాతిలో విపరీతమైన మంట, ఇదే అసిడిటీ సమస్యకు మూలం. జీర్ణాశయంలో ఉండాల్సిన ఆమ్లం అన్నవాహిక లోకి ఎగదన్నుకొని రావడం వల్ల వచ్చే సమస్య కాబట్టి దీన్ని గ్యాస్ట్రో ఈసోపేగల్ రిఫ్లెక్స్ డిసీస్ అని అంటారు. వైద్య పరిభాషలో జీ ఈ ఆర్ డి- గర్డ్ అంటారు. జీర్ణాశయం గోడలను ఈ ఆమ్లం ఏమీ చేయదు.. అందుకు తగ్గట్టుగానే రక్షణ ఉంటుంది.. కానీ అన్నవాహికలో ఇటువంటి ఏర్పాట్లు ఉండవు. కాబట్టి జీర్ణాశయంలో ఉండాల్సిన ఈ ఆమ్లం అన్నవాహికలోకి తన్నుకొచ్చినప్పుడు మంటలాంటి బాధలే కాదు.. ఆ లోపలి గోడలు దెబ్బతింటాయి. ఆమ్లం ప్రభావానికి అక్కడ అల్సర్లు లేదా పుండ్లు ఏర్పడతాయి. దీన్ని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్లకూ దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే అసిడిటీని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.

-జీవన శైలి మార్చుకోవాలి

అసిడిటీకి జీవనశైలికి సంబంధం ఉంది.. కాబట్టి మందులు మొదలుపెట్టేముందు మన జీవనశైలిని మార్చుకోవడం చాలా అవసరం.. పొగ, మద్యం తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.. నూనె, నెయ్యి వంటివి బాగా వేసి వండిన పదార్థాలు, మసాలాలను బాగా తగ్గించాలి.. ముఖ్యంగా తినగానే పడుకోవడం మానేయాలి.. భోజనం చేశాక కనీసం రెండు గంటల తరవాతే పడుకోవాలి.. పడుకున్నప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.. బిగుతు దుస్తులు వేసుకోవద్దు. నిత్యం వ్యాయామం చేయాలి.. చీటికిమాటికి నొప్పులు తగ్గే మాత్రలు వేసుకోవద్దు.. ఇలా చిన్నచిన్న మార్పులు చేసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుతుంది.. చాలామంది వీటిని పాటించరు. వల కడుపు మంట పెరుగుతుంది. ఒక దశ దాటితే మందులు తీసుకోక తప్పదు. ఈ సమస్యకు ఇప్పుడు ఎంతో శక్తివంతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి.. ఓమి ప్రజోల్, ఎసమ ప్రజోల్, పాంటా ప్రజోల్, లాన్స ప్రజోల్, రాబీ ప్రజోల్ వంటి ఔషధ నామాలతో దొరికే ఈ ప్రోటాన్ పంప్ ఇన్ హిబ్బిటర్స్ రకం మందులు అసిడిటీ సమస్యకు రామబాణం లాంటివి. ఇవి ఆమ్ల ఉత్పత్తిని బాగా తగ్గిస్తాయి.. దీంతో ఫలితాలు చాలా బాగుంటాయి.. వీటిని రెండు లేదా మూడు నెలలు వాడితే లక్షణాలు పూర్తిగా తగుముఖం పడతాయి.. అయితే వీటిని వేసుకోవడం ఆపేసిన కొన్ని రోజులకే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది.. మందు వేసుకున్నంతకాలమే పనిచేస్తుండడం నిజంగా పెద్ద సమస్యే. నిజానికి వీటిని వైద్యుల సిఫార్సు లేకుండా దీర్ఘకాలం వేసుకోకూడదు.. ఎందుకంటే వీటిని ఏళ్ల తరబడి వాడితే కొన్ని అనర్ధాలు తలెత్తుతున్నాయని పరిశోధనలో గుర్తించారు.. ముఖ్యంగా ఎముకల్లోని క్యాల్షియం తగ్గి ఎముకలు గుల్లబారి త్వరగా విరిగే ప్రమాదం ఉంటున్నదని గుర్తించారు..

అలాగే జీర్ణాశయంలోని ఆమ్లాన్ని తగ్గించడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని తేలింది.. మొత్తానికి వీటిని కొన్ని నెలలు వేసుకోవడం మానేయడం… లక్షణాలు మొదలుకాగానే వేసుకోవడం ఇలా చేయడం అసలు సరికాదు.. దీనివల్ల ఆమ్లం ఎగదన్నే సమస్య పూర్తిగా తగ్గకపోగా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది.. కాబట్టి వైద్యుల సిఫార్సు మేరకే మాత్రలను వాడాలి. ఇక అసిడిటీని గుర్తించేందుకు చాలా వరకు రోగులు చెప్పే బాధలు లక్షణాలు సరిపోతాయి.. అవసరమైతే నోటి ద్వారా కిందికి కెమెరా గొట్టం పెట్టి చూస్తారు. జీర్ణాశయంలోంచి ఆమ్లం ఎలా పైకి తన్నుకొస్తుందో ఈ పరీక్షలో స్పష్టంగా కనిపిస్తుంది.. దీని తీవ్రత కూడా తెలుస్తుంది.. ఇక కడుపులో ఆమ్ల స్వభావాన్ని తెలుసుకునేందుకు పీహెచ్ పరీక్షలు, కండర కవాటం సమర్థంగా ఉందా లేదా? బలహీనపడిందా? అన్నది తెలుసుకునేందుకు మ్యానోమెట్రీ అనే పరీక్ష వంటివి కొంతమేర ఉపయోగపడుతుంది.. అవేవీ కడుపు మంటను కచ్చితంగా నిర్ధారించేవి కాకపోయినప్పటికీ.. సమస్య అదేనా కాదా అదే అయితే ఎంత తీవ్రంగా ఏ గ్రేడ్ లో ఉందన్నది తెలుసుకునేం దుకు బాగానే ఉపకరిస్తాయి. ఇక గత కొంతకాలంగా మనుషుల ఆహారపు అలవాట్లలో పూర్తి మార్పులు వచ్చాయి. శాకాహారం తగ్గి మాంసాహార వినియోగం పెరిగింది. తీసుకునే ఆహారానికి సంబంధించి ఒక నిర్ణీతమైన వేళలు పాటించకపోవడంతో జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడుతున్నాయి.. వీటిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయి.