Sleeping late at Night: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. ఒకప్పుడు సాయంత్రం ఏడు గంటలకు నిద్రపోయి.. ఉదయం 6 గంటలకు నిద్రలేచేవారు. దీంతో పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం జీవించారు. అయితే ప్రస్తుత కాలంలో వివిధ పనుల కారణంగా చాలామంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారు. కొంతమంది రాత్రి నిద్రను చెడగొట్టుకోవడమే కాకుండా.. మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు స్నేహితులతో సరదాగా ఉంటున్నారు. ఇలా అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసా?
నిద్రలేమి కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర చాలా అవసరం. అయితే నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలేమి అనేది ఒత్తిడి హార్మోలను రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్లు రక్తప్రసరణలో ఇబ్బందులు కలిగించి గుండెపోటుకు దారితీస్తుంది. సరైన నిద్ర పోయినప్పుడు రక్తనాళాలు పటిష్టంగా ఉంటాయి. నిద్రలేమి కారణంగా ఇవి సరైన విధంగా పనిచేయకుండా ఉంటాయి. ఫలితంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నిద్ర తక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఇన్సులిన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గి నిరంతరం అలసటతో ఉంటారు. నిద్రలేమి కారణంగా ఆకలిని పెంచే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో పరిమితికి మించి ఆహారం తీసుకొని బరువు పెరుగుతారు. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తద్వారా ఆకలిని చంపేస్తుంది. ఇది క్రమంగా శక్తిని తగ్గించి బలహీనులను చేస్తుంది.
నిద్రలేమి కారణంగా మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఏ పని చేయడానికి ఏకాగ్రత ఉండదు. ఒక్కోసారి తీవ్రమైన మానసిక సమస్యలు వచ్చి నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆలోచనల తీరు కూడా మారే అవకాశం ఉంటుంది. వరుసగా నిద్రలేమి ఏర్పడితే చికాకు, కోపం వచ్చి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. క్రమంగా గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే కోపం నియంత్రణ కోల్పోవడంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే చాలామంది రాత్రిళ్ళు ఎక్కువసేపు నిద్ర లేకుండా ఉండి.. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఇలా చేసినా కూడా ప్రమాదమే ఉంటుంది. ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల చురుకుదనం తగ్గిపోతుంది. కొన్ని పనులను పూర్తి చేయడానికి సరైన శక్తి లభించదు. నిద్ర గడియారం సరిగ్గా లేకపోతే రోగ నిరోధక శక్తి తగ్గి చిన్న చిన్న వ్యాధులకే పెద్దగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండడం వల్ల మెదడు లో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. అందువల్ల సరైన సమయంలో నిద్రపోయి.. ఉదయం తొందరగా నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.