Buying These Medicines In Medical Shops: ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యత లేని ఫుడ్ కావచ్చు.. నాణ్యత లేని ప్రకృతి కావచ్చు.. కారణం ఏదైనా మనిషి నిత్యం అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నాడు. ఏ ఇంటా చూసినా ఏదో ఒక చిన్న పాటి జ్వరంతో అయినా బాధపడుతున్న వారు ఉన్నారు. వ్యాధి నిరోధక శక్తి సరిగా లేక నిత్యం హాస్పిటల్స్ లేదంటే మెడికల్ షాపులకు పరుగెత్తాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ షాపులో ఏ మందు ఇస్తే దానికి తీసుకొచ్చి వేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. దాంతో మెడికల్ దందా కూడా దేశంలో విపరీతంగా పెరిగిపోయింది.
ఒకప్పుడు మన పాతకాలం నాటి వారు ఎలాంటి నొప్పి వచ్చినా తట్టుకొని నిలబడేవారు. టాబ్లెట్స్ వాడకం అనేది పెద్దగా వారికి తెలియకపోతుండే. రోగం మరీ ఎక్కువైతే తప్పితే వారు డాక్టర్ల వద్దకు వెళ్లే వారు కారు. మందులు అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడేవారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవి కూడా ఆయుర్వేదాన్నే సంప్రదిస్తుండేవారు. అంతే తప్పితే టాబ్లెట్స్ అనేవి వారికి తెలియదు. అందుకే వారు అంత గట్టిగా ఉన్నారని చెప్పడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ.. ఇప్పటి ప్రజలు మాత్రం ఒకవిధంగా చెప్పాలంటే టాబ్లెట్స్ మీదనే బతుకుతున్నారు. చిన్న నొప్పి నుంచి పెద్ద సర్జరీ వరకూ టాబ్లెట్స్ తింటూ బతికేస్తున్నారు ఏమాత్రం చిన్నపాటి నొప్పిని సైతం భరించలేక మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. చిన్న దానికి పెద్దదానికి కూడా గోళీలు వాడుతూ బాడీని టాబ్లెట్స్‌కు కేరాఫ్‌గా మార్చేస్తున్నారు. దీంతో ఏ గల్లీలో చూసినా హాస్పిటల్స్ వెలిశాయి. ఊరూరా పది వరకు మెడికల్ షాపులు కనిపిస్తున్నాయి. అయితే.. ఇలా ఇష్టారీతిన టాబ్లెట్స్ వాడడం వల్ల మరింత ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎలా పడితే అలా టాబ్లెట్స్ వాడితే మరిన్ని అనారోగ్య పరిస్థితులకు కారణం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
కొంతమంది పల్లెల్లో కానీ.. పట్టణాల్లోనూ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీల్లో మందులు కొంటున్నారు. సరైన అవగాహన లేకుండానే షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే.. యాంటీ బాడీస్ ఇష్టారీతిన వాడితే ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే అవి యాంటీబయాటిక్ కదా అని కూడా అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ అవి యాంటీబయాటిక్ కేటగిరీకి చెందినవి అయితే వద్దని నిర్దాక్షిణంగా చెప్పాలని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ వాడాల్సి వస్తే డాక్టర్ సూచన తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో అన్ని వివరాలు ఉండడంతోపాటు.. ఆ రోగానికి సంబంధించి ఎంత మోతాదు ఇవ్వాలో వారికి ఒక ఐడియా ఉంటుంది. సదరు రోగి ఏ వ్యాధితో బాధపడుతున్నాడు.. ఎప్పటి నుంచి బాధపడుతున్నాడు.. అతని వయసు ఎంత.. అతడికి ఎంత వరకు డోస్ ఇవ్వాలి అని క్లియర్‌గా వైద్యులకు తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి అవి వేసుకున్నా పెద్దగా నష్టం ఉండదు. అందుకే.. ఇక నుంచైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ మెడిసిన్ వాడడం మంచిది కాదని సూచిస్తున్నారు.