మన ఇంట్లో ఎక్కువగా తీసుకునే కూరగాయలలో బంగాళదుంపలు కూడా ఒకటి. బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బంగాళదుంపలను ఇష్టపడతారు. కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే బంగాళదుంపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి కావాల్సిన పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం బంగాళదుంపల వల్ల మనకు లభిస్తాయి.
సోడియం, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సైతం బంగాళదుంపలలో తక్కువగా ఉంటాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సైతం బంగాళదుంపలు సహాయపడతాయి. కెరోటినాయిడ్ పుష్కలంగా ఉండే బంగాళదుంపలు కళ్లు, గుండె సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తాయి. బంగాళ దుంపల ద్వారా మన శరీరానికి అవసరమైన ప్రీ బయోటిక్ బ్యాక్టీరియా కూడా లభిస్తుంది. ఆకలిని తగ్గించడానికి బంగాళదుంపలు తోడ్పడతాయి.
బంగాళదుంపలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండెల్లో మంటను తగ్గిస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. ప్రతిరోజూ బంగాళదుంపలతో చేసిన వంటకాలను తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో బంగాళదుంపలు సహాయపడతాయి. అయితే బంగాళదుంపలను పరిమితంగా తీసుకోకుండా ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
బంగాళదుంపలు ఎక్కువగా తీసుకుంటే వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బంగాళదుంపలు ఎక్కువగా తీసుకునే వారిలో కాళ్లు పట్టేయడం, నరాల సమస్యలు వస్తాయి. బంగాళదుంపలతో తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. బంగాళదుంపలు ఎక్కువగా తీసుకుంటే గ్లైకో ఆల్కలాయిడ్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవడమే మంచిది.