
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మొదట్లో 80,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 30,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా వెయ్యి లోపే కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 502 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది.
కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,57,876కి చేరగా కరోనా మృతుల సంఖ్య 1407కు చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల పరంగా, మరణాల పరంగా తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్యతో పోల్చి చూస్తే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం అత్యల్పంగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కేవలం 753 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 43,044 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య సైతం భారీగా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,892 యాక్టివ్ కేసులు ఉండగా 8,29,991 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 6,881 మంది మృతి చెందారు.