అప్పుల కుప్ప.. అదే తెలంగాణ గొప్ప..

తెలంగాణ అంటేనే పోరాటాల పోరుగడ్డ. అన్యాయాలను ఎదిరించి, రొమ్ముచూపి ముందుకురికి రక్తతర్పణంచేసిన పవిత్ర భూమి. ఆ పోరాటాల స్ఫూర్తే నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు నాంది పలికింది. నేడు మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం కూడా అంత సులభంగా వచ్చింది కాదు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు, నిర్బంధాలు, లాఠీదెబ్బలు, ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడిన తెలంగాణ జన సమూహాలు, కదలివచ్చిన సర్వజనులు. ఇది ఎవరి దయాభిక్షమో కాదు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అంతలా పోరాడి సాధించుకున్న […]

Written By: NARESH, Updated On : November 8, 2020 10:08 am
Follow us on

తెలంగాణ అంటేనే పోరాటాల పోరుగడ్డ. అన్యాయాలను ఎదిరించి, రొమ్ముచూపి ముందుకురికి రక్తతర్పణంచేసిన పవిత్ర భూమి. ఆ పోరాటాల స్ఫూర్తే నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు నాంది పలికింది. నేడు మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం కూడా అంత సులభంగా వచ్చింది కాదు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు, నిర్బంధాలు, లాఠీదెబ్బలు, ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడిన తెలంగాణ జన సమూహాలు, కదలివచ్చిన సర్వజనులు. ఇది ఎవరి దయాభిక్షమో కాదు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం.

అంతలా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? 2014లో రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ ఆరేండ్లలో అప్పులు గణనీయంగా పెరిగిపోయాయా? ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల వడ్డీలనే చెల్లిస్తోందా..? రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న అప్పు ఇప్పటికీ ఐదింతలు దాటిందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానంగా తెలంగాణ అప్పుల కుప్పగా మారిందనే విషయం స్పష్టమవుతోంది. అది స్వయానా రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కూడా ఒప్పుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

2014–-15 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మీద రూ.79 వేల 880 కోట్ల అప్పుల భారం ఉండగా రూ.5 వేల 593 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించింది. 2015–-16 నాటికి అప్పులు రూ.97 వేల 992 కోట్లకు చేరగా 7 వేల 942 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. 2016–-17 ఫైనాన్షియల్ ఇయర్‌కు రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.లక్షా 34 వేల 738 కోట్లకు చేరగా.. ఆ ఏడాది రూ.8 వేల 609 కోట్ల ఇంట్రెస్ట్ చెల్లించింది. ఇక 2017–-18 నాటికి అప్పుల భారం మరింత పెరిగింది. ప్రభుత్వం చేసిన అప్పులు రూ.లక్షా 51 వేల 133 కోట్ల రూపాయలకు చేరగా.. ఆ సంవత్సరం రూ.11వేల139 కోట్ల వడ్డీ కట్టింది. అలాగే 2018–-19 ఆర్థిక సంవత్సరానికి అప్పులు తడిసిమోపెడయ్యాయి. రూ.లక్షా 80 వేల 239 కోట్ల అప్పుకు గాను రూ.11 వేల 691 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించడం గమనార్హం. ఇక ఇప్పుడు ఆ అప్పు రూ.4 లక్షల కోట్లు దాటిందంటే ఆశ్చర్యపడాల్సిన అంశం. దీనిపై కట్టాల్సిన వడ్డీ ఎంతో అంచనాకు కూడా దొరకని పరిస్థితి.

ఉమ్మడి రాష్ట్రం నుంచి రూ.70 వేల కోట్లను తెలంగాణ రాష్ట్రం పంచుకుంది. గత ఆరేండ్లలో ఈ అప్పు ఆరింతలు పెరిగింది. తీసుకున్న అప్పులకు మిత్తి ఏటా తడిసి మోపెడవుతోంది. కేవలం వడ్డీలకు నిరుడు రూ.13 వేల కోట్లు ముట్టజెప్పగా ఈ ఏడాది రూ.14,600 కోట్లను సర్కారు కేటాయించింది. నెలనెలా ఇన్‌‌స్టాల్‌‌ మెంట్లు చెల్లించేందుకు ముప్పు తిప్పలు పడుతోంది. ఇన్నాళ్లూ తెలియకపోయినా మూడు నెలలుగా కరోనా వైరస్‌‌ వల్ల ముసురుకున్న సంక్షోభం రాష్ట్ర ఎకానమీని బట్టబయలు చేసింది. నిర్వహణ ఖర్చులకే నెలనెలా రూ.4 వేల కోట్ల కొత్త అప్పు చేస్తున్న తీరు ధనిక రాష్ట్రం స్వరూప స్వభావాలను వేలెత్తి చూపింది. కరోనా టైమ్‌లో 3 నెలలపాటు సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలియ్యలేక కోతపెట్టింది. నెలనెలా ఇచ్చే ఆసరా పెన్షన్లు, పథకాల కోసం కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: ఎగ్జిట్ పోల్స్: బీహార్ లో అధికారం వీరిదే..

సొంత ఆదాయ వనరులతోపాటు వివిధ మార్గాల్లో రాష్ట్ర ఖజానాకు ప్రతినెలా రూ.11 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల రాబడి వస్తోంది. అయితే.. ఆర్బీఐతోపాటు వివిధ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటికే రూ.4 లక్షల కోట్లకు చేరింది.ఈ అప్పులను నెలనెలా వాయిదాల్లో చెల్లించటం అనివార్యమైంది. ఇదే సర్కారుకు గుదిబండగా మారింది. వేలాది కోట్లు అప్పుల కిస్తీలకే పోతున్నాయి. ఇక ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, రిటైర్ అయినోళ్ల పెన్షన్ల కోసం రూ.2,500 కోట్లు అవసరం. జీతాలతో పోలిస్తే అప్పుల కిస్తులే ఎక్కువ ఉండటం గమనార్హం.

లాక్‌‌డౌన్ టైమ్‌లో సర్కారు ఆదాయానికి పూర్తిగా గండి పడింది. అదే టైమ్‌లో అప్పుల చెల్లింపులూ మీద పడటం ఖజనాను అతలాకుతలం చేసింది. ఆ ఎఫెక్ట్ పథకాలపై పడింది. నెలనెలా ఇచ్చే బియ్యం సబ్సిడీ, ఆరోగ్య శ్రీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లపై ఎఫెక్ట్ కనిపించింది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీని ఇప్పటికీ అమలు చేయలేక పోయింది. రుణమాఫీకి 3 నెలల కిందట రూ.1,210 కోట్లకు ఉత్తర్వులిచ్చినా నిధులింకా విడుదల చేయలేదు. గత రెండేళ్లలో చాలా చోట్ల రైతు బంధు డబ్బులు జమ చేయకుండా రూ. 4,500 కోట్లు ఆపేసింది. ఈసారి రైతుబంధు నిధులాపితే వ్యతిరేకత వస్తుందని అప్రమత్తమైంది. గత వారం రోజుల్లోనే రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమచేసింది.

మరోవైపు అప్పు మీద అప్పులు చేసేందుకు ప్రభుత్వం కూడా వెనుకాడట్లేదు. గత 3 నెలల్లోనే రూ.12 వేల కోట్లకు పైగా అప్పుతెచ్చింది. ప్రతినెలా సగటున రూ.4 వేల కోట్ల విలువైన బాండ్లు వేలం వేసి ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంది. ఏప్రిల్‌లో రూ.4 వేల కోట్లు, మే లో మరో రూ.4 వేల కోట్లు, జూన్‌‌లో ఇప్పటికే రూ.4,460 కోట్లు బాండ్లు అమ్మి సేకరించింది. ఎఫ్‌‌ఆర్‌‌బీఎం రూల్స్‌ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. కానీ తొలి 3 నెలల్లోనే ఇందులో 83 శాతం అప్పులను సర్కారు వాడేసుకుంది. ఈ లెక్కన వచ్చే 6 నెలలు ఖజానా గండం ఎట్లా గట్టెక్కుతుందని అధికారులూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read: 100 మంది పోలీసులు.. రాజాసింగ్ ఇంటి వద్ద టెన్షన్

సాధారణంగా రాష్ట్రాలు ఆర్‌‌బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్పేరిట డబ్బును చేబదులు తెచ్చుకుంటాయి. ఆదాయం సమకూరగానే వారం నుంచి పది రోజుల్లో తిరిగి చెల్లిస్తాయి. అయితే.. జూన్, జులై, ఆగస్టు మూడు నెలల్లో సగటున రూ.1,200 కోట్లు ఆర్‌‌బీఐ నుంచి తెలంగాణ చేబదులు తెచ్చుకుంది. జులై, ఆగస్టులో వీటిని తిరిగి తీర్చలేకపోయింది. వేస్ అండ్ మీన్స్‌‌కి మించి డబ్బులు అవసరం కావటంతో ఆర్‌‌బీఐ నుంచి ఓవర్డ్రాఫ్ట్ పేరుతో మరింత డబ్బు తీసుకుంది. జులైలో రూ.286 కోట్లు, ఆగస్టులో రూ.756 కోట్లు ఓడీ తీసుకుంది. అంటే హద్దులు మీరి రాష్ట్ర ప్రభుత్వం చేబదులు చేస్తున్న తీరు ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆదాయ వ్యయ నిర్వహణలో క్రమ శిక్షణ పాటించకపోవటం, ఇష్టమొచ్చినట్లు అప్పులు తీసుకురావటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు దాటాయి. అధికారికంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఆరేళ్లలో రూ.1.88 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇవి కాకుండా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా ఇరిగేషన్‌‌, ఎలక్ట్రిసిటీ తదితర ప్రాజెక్టుల కోసం అంతకుమించి అప్పులు తెచ్చింది. వీటన్నింటికీ ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి రుణ సమీకరణ చేసింది. ఇలా తెచ్చిన అప్పులు రూ.2.58 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.54 లక్షల కోట్ల అప్పులున్నాయని, గడిచిన ఐదేళ్లలో రూ.34,296 కోట్లు రీ పే చేశామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించారు. ఈ లెక్కన చూసుకున్నా రూ.4.12 లక్షల కోట్ల అప్పుల భారం మిగిలే ఉంది.

కరోనా టైమ్లో ఆదాయానికి లోటు లేదని.. సర్కారుకు ఇమేజీ ఉంది కాబట్టి అప్పులు వస్తున్నాయని సీఎం కేసీఆర్చెప్పారు. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు లోన్‌‌ లింకేజీ ఉంది కాబట్టి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. కానీ.. కొన్ని నెలల్లోనే సీన్‌‌ రివర్స్‌‌ అయింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లు, కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీకి రూ. 14 వేల కోట్ల అప్పులు ఇవ్వబోమని పవర్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌, రూరల్‌‌ ఎలక్ట్రిఫికల్‌‌ కార్పొరేషన్లు తేల్చిచెప్పాయి. బ్యాంకుల కన్సార్షియం కూడా ఇప్పట్లో ఎలాంటి లోన్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల పనులు చేసిన వర్క్‌‌ ఏజెన్సీలకు బకాయి పడ్డ రూ.10 వేల కోట్ల పేమెంట్లను ప్రభుత్వం ఆపేసింది. ఈ ఫైనాన్స్‌‌ ఇయర్‌‌లో పేమెంట్‌‌ చేయలేమని తేల్చిచెప్పింది. ఇతరత్రా లోన్లు రాకపోవడంతో నాబార్డ్‌‌ ద్వారా రుణ సమీకరణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతోపాటు జీవన ప్రమాణాలు పెంపొందించే కార్యక్రమాలపై సర్కారు ఫోకస్‌‌ చేసింది. అదే సమయంలో సర్కారు బాండ్లను వేలం వేయడం ద్వారా నెలకు రూ. 4 వేల కోట్ల వరకు అప్పులు తెచ్చి ఆ మొత్తంతో బండి లాగిస్తోంది.

Also Read: ఆడియో వైరల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతులు.. యువకుడు కడిగేశాడు

కరోనా కష్టాలతో ఖజానా కుదేలైంది. ఆదాయం సగానికి పడిపోయింది. సాధారణంగా రావాల్సిన ఆదాయంలో 55 శాతం వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చులకు మిగతా 45 శాతం అప్పులు తెచ్చింది. ఏప్రిల్‌‌ నుంచి అక్టోబర్‌‌ వరకు దాదాపు రూ.3‌‌0 వేల కోట్లు అప్పులు తెచ్చింది. ఏప్రిల్‌‌, మే నెలల్లో కలిపి రూ.13,352 కోట్లు, జూన్‌‌లో రూ.4,318 కోట్లు, జులైలో రూ.3,113 కోట్లు, ఆగస్టులో రూ.3,936, సెప్టెంబర్‌‌లో రూ.2,500 కోట్లు, అక్టోబర్‌‌లో రూ.2,750 కోట్ల అప్పులు చేసింది. నవంబర్‌‌లో రూ.750 కోట్ల అప్పు కోరింది. ఈ నెల 10న బాండ్ల వేలం నిర్వహించనుంది. అంతేకాదు.. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లను తగ్గించనుంది. ఈవిషయాన్ని స్వయానా కేసీఆర్ ప్రకటించారు.

ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులతోపాటు కార్పొరేషన్ల అప్పుల కిస్తీలే తడిసి మోపెడవుతున్నాయి. అసలు, మిత్తీల చెల్లింపులకే ప్రతి నెలా రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. లాక్‌‌డౌన్‌‌ టైమ్లో సీఎం కేసీఆర్‌‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న లోన్ల రీ పేమెంట్‌‌ ఈ ఏడాదే ప్రారంభమైంది. తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఏటా పెరుగుతూ పోతోందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో కిస్తీలు చెల్లించడానికి తిరిగి అప్పులు చేయడం మినహా వేరే మార్గం లేదని అంటున్నాయి. మొత్తానికి ఆరేండ్ల పసిపాప మీద ఇన్ని లక్షల కోట్ల అప్పు పెట్టడంపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అప్పుల నుంచి రాష్ట్రం ఎలా బయటపడుతుందా అని చర్చిస్తున్నారు.

-శ్రీనివాస్.బి