రాష్ట్రంలో ఎన్నికలు నడుస్తున్నాయంటే ప్రభుత్వం డమ్మీ అయిపోయి.. ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ అవుతుంది. రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ ఆయనకు వస్తాయి. సరిగా ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ఎస్‌ఈసీ తనకు ఇష్టం వచ్చినట్లు అధికారులను బదిలీ చేస్తూనే ఉన్నారు. అయితే..ఈ బదిలీలు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా.. లేకున్నా ఈసీ ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి. ఎంతటి వారైనా అమలు చేసి తీరాల్సిందే.
Also Read: అందుకేనా కాపులతో పవన్ భేటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితి గతంలోనూ ఒకసారి ఎదురైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. తనకు ప్రీతిపాత్రుడైన అధికారిని ఎన్నికల కమిషన్ బదిలీ చేయాలని ఆదేశిస్తే.. ‘మీకు చేతనైంది చేసుకోండి.. నేను బదిలీ చేయనని’ ఆయన భీష్మించారు. అది 2006వ సంవత్సరం. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నారు. విశాఖ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. రిటర్నింగ్ అధికారి(కలెక్టర్)గా ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారు. అప్పటికే పోలింగ్ బూత్ అధికారుల జాబితాకు ఈసీ ఆమోదం తెలిపింది. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఒకరిపై కొన్ని ఫిర్యాదులు, అభియోగాలు వచ్చాయి. అప్పటికప్పుడు ఆ అధికారిని పోలింగ్ అధికారుల జాబితా నుంచి తొలగిస్తూ ప్రవీణ్ ప్రకాశ్ స్వీయ నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలిసి కమిషన్ సీరియస్ అయింది.
వెంటనే ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ పిళ్లై నుంచి ప్రవీణ్‌ప్రకాశ్‌కు ఫోన్ వచ్చింది. ‘ఈసీ ఆమోదం పొందాక ఆ జాబితాను మీ పాటికి మీరు మార్చడం కుదరదు. మళ్లీ సవరణలు ప్రతిపాదించి ఆమోదం పొందాలి’ అని ఆదేశించారు. ప్రవీణ్ ప్రకాశ్ కాస్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వెంటనే ఆయనపై ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. మరుక్షణమే రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, అధికారుల సూచనలను ధిక్కరించారని, ఆయన ఎన్నికల విధులకు అర్హుడు కానందున తక్షణమే బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. అయితే అంతా వారి (ఈసీ) ఇష్టమేనా అని వైఎస్ ఆగ్రహించారు.
ప్రవీణ్ ప్రకాశ్ అప్పటికే వైఎస్‌కు ఆప్తుడు, ఆత్మీయుడు. ఆయన్ను తొలగించాల్సిన అవసరం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కానీ.. అప్పటి సీఎస్ స్పష్టంగా ఒక్కటే చెప్పారు. ‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీయే సుప్రీం. మనం వారితో ఘర్షణకు దిగితే మనకే నష్టం. ఇది జాతీయ సమస్య అవుతుంది. పునరాలోచించుకోండి. అతడిని బదిలీ చేద్దాం’ అని సూచించారు. సీఎస్ మాటను వైఎస్ గౌరవించి.. ప్రవీణ్ ప్రకాశ్‌ను పశ్చిమగోదావరి కలెక్టర్‌గా బదిలీ చేశారు. 2008లోనూ ఇలాంటి ఉదంతమే జరిగింది. అప్పుడూ వైఎస్సే సీఎంగా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్. దాని పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ 2008 ఏప్రిల్ 26న ఆదేశించింది. వైఎస్ సర్కారు అమలు చేసింది. ఈసీ ఆదేశాలంటే అలాగే ఉంటాయి.
Also Read: కయ్యానికి దిగి సాధించిందేంది..?
ఇప్పుడు ఇదే ప్రవీణ్ ప్రకాశ్ సీఎం జగన్‌కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల విధుల నుంచి ఆయన్ను తప్పించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలన్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో ప్రవీణ్ విఫలమయ్యారని ఎస్‌ఈసీ తెలిపారు. ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. 25న నామినేషన్ల స్వీకరణకూ సహకరించలేదని అన్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని.. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా లక్ష్మణ రేఖ దాటారని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నామని లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Nimmagadda who targeted jagan close associates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com