ఆర్ధికంగా ఆదుకోవడం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపడమే కాకుండా, సాధారణంగా రావలసిన నిధులను సహితం ఇవ్వకుండా సహాయనిరాకరణ పాటిస్తూ ఉండడం, మరో వంక ప్రభుత్వ ఆదాయ మార్గాలు తగ్గిపోతూ ఉండడం, చివరకు అప్పులు కూడా చేయలేని పరిస్థితులు నెలకొనడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ధికంగా తీవ్ర సంక్షోభకర పరిష్టితులలో చిక్కుకున్నది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే 11 నెలలు గడిచి పోగా, రూ 46,000 కోట్ల లోటు పేరుకు పోవడంతో చివరి నెల ఎట్లా అని దిక్కుతోచని పరిస్థితులు వెంటాడుతున్నాయి. గత ఏడాది జనవరి నెలాఖరుకు కేంద్రం నుండి 33.25శాతం గ్రాంట్లు రాగా, ఈ ఏడాది 22.20 శాతానికి తగ్గిపోయాయి. ఇతర పద్దుల పరిస్థితి కూడా ఇంతే!
దీనికి తోడు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు సడలించాలంటూ చేసిన విజ్ఞప్తులకు సైతం కేంద్రం స్పందించకపోవడంతో రుణాలు తీసుకునే అవకాశం కుదించుకుపో యింది. జాతీయ బ్యాంకులు కూడా ఆశించిన రీతిలో సహకరించడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఖర్చులు ఏ నెలకు ఆ నెల పెరుగుతున్నాయి.
జనవరి నెలాఖరుకు కేంద్ర, రాష్ట్ర వనరులను కలుపుకుని రూ 2.14 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా, రూ 1.33 లక్షల కోట్లు (11 నెలల్లో 62 శాతం) మాత్రమే వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో గండి పడటానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు అన్ని పద్దుల్లోనూ తగ్గుతుండమే కారణం.
కేంద్రం నుంచి రావాల్సిన రూ 61 వేల కోట్లకుగాను అతి తక్కువగా రూ 13,500 కోట్లు మాత్రమే వచ్చాయి. పూర్తిస్థాయిలో లెక్కలు తీస్తే ఇది మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా కలిపి రూ.1.78 లక్షల కోట్లు రావాల్సిఉండగా రు.86 వేల కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ఇక్కడ కూడా గత ఏడాదితో పోల్చి చూస్లే ఇది 11 శాతం తక్కువ, విడివిడిగా చూస్తే దాదాపుగా అన్ని రాష్ట్ర ఆదాయ వనరుల శాఖలు 60శాతం లక్ష్యాలు చేరుకోగా, పన్నుల్లో వాటా ద్వారా రాష్ట్రానికి రావాల్సిన మొత్తం 45 నుండి 50 శాతం లోపే వచ్చినట్లు సమాచారం,
పెట్టుబడి ఆదాయం (క్యాపిటల్ రెవిన్యూ) రూ 35,800 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా రూ 47 వేల కోట్లు ఖజానాకు చేరాయి. అయితే, ఈ మొత్తంలో రూ 46,500 కోట్లు అప్పులే కావడం గమనార్హం. అన్ని రంగాల్లోరూ 2.12 లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో అంచనా వేయగా, రూ 1.27 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ ఖర్చులో కూడా రెవెన్యూ వ్యయమే రూ 1.20 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేల్చారు.
ఇక కీలకమైన పెట్టుబడి వ్యయం అతి తక్కువగా రూ 7200 కోట్లే ఖర్చు చేసినట్లు తేలింది. రూ 32 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పెట్టుబడి వ్యయంలో 22 శాతం మాత్రమే ఖర్చు చేయడం వల్ల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడినట్లు కనిపిస్తోంది.
ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు భారీగా ఉండటం వంటి కారణాల వల్ల ఆదాయ, ద్రవ్య లోటు కూడా భారీగానే రికార్డవుతున్నాయి. తాజా గణారకాల మేరకు ఆదాయ లోటు రూ 1779 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, జనవరి చివరి నాటికే రూ 34,690 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇక ద్రవ్య లోటు కూడా రూ 35 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, ఇప్పటికే రూ 46 వేల కోట్లు దాటిపోయినట్లు తేలింది.