Geetanjali : శవంగా మారిన ఈ పిల్లల తల్లిని ఓ నాలుగురోజుల క్రితం టివీలో క్లిప్ చూశాం రాత్రిపూట అన్నం తింటూ. నా సహచరికి భలే నచ్చింది, ఇంటిపట్టా తీసుకోవడం, పిల్లలను చదివించుకోవడం..ఆమె సంతోషమంతా మొహంలో కనిపిస్తోందని చెప్పింది.
నిజానికి ఆమె ఏ పార్టీనీ సమర్థించలేదు, ఏ ఎదుటి పార్టీనీ విమర్శించలేదు. ఒక ప్రభుత్వం న్యాయంగా తనకు దక్కించిన ప్రతిఫలం పట్ల మాత్రమే కృతఙ్ఞతలు చెప్పుకుంది. అదికూడా ఏ ప్రత్యేక ప్లాట్‌ఫాం మీద కాదు, ఒక విలేక్షరి మొహమ్మీద మైకు పెట్టినప్పుడు ప్రతిస్పందించింది. ఈ మాత్రం స్పందన అంత నేరమైపోయిందా? ప్రాణాలు హరించేంత ద్వేషానికి కారణమైందా? అదీ మూకుమ్మడిగా వ్యక్తిత్వాన్ని చంపేసి ఏకంగా భౌతికంగా మనిషిని తుదముట్టించేటంతటి దుర్మార్గంగా తయారైందా?
ఈ దేశంలో వున్నంత మానసిక రుగ్మతలు కలిగిన మనుషులు ప్రపంచంలో ఎవరూ వుండరు. కుటుంబాలు, బంధాలూ, సెక్స్ సమస్యలతో బాధపడే ఈ మానసికరోగులు డబ్బు, కులం, ప్రాంతం, పార్టీ, మతం, దేవుడు వంటి అంశాలు ఆలంబన అవుతాయి. వాటిపట్ల పిచ్చిప్రేమ, వాటికి ఆవతలివైపు వెర్రి ద్వేషం పెంచుకుని తాము నిరంతరం హింసించుకుంటూ ఎదుటివారిని హింసిస్తూ వుంటారు.
ఇన్నాళ్లూ ఈ భావోద్వేగాలు ఇల్లు, స్నేహితులు, ఇరుగుపొరుగు, బంధువులు చూస్తారని అణచిపెట్టుకుని గుంభనంగా వుండేవాళ్లు. ముక్కూ మొహం తెలియకుండా ఈ ప్రేమాద్వేషాల్ని ప్రకటించుకునే సోషల్ మీడియా అందుబాటులోకి రాగానే, ముసుగులేసుకుని సాటిమనుషులమీద పడిపోతున్నారు.
మనిషికి మాత్రమే సాధ్యమైన విషయాన్ని మాట్లాడే శక్తిలేని అల్పులు వీళ్లు. విషయమ్మీద మాట్లాడలేని తెలివిలేనివాళ్లు వీళ్లు. ప్రతి వాక్యంలో శరీర రహస్య అవయవాలు చొప్పించే సిగ్గులేని జనం వీళ్ళు. స్త్రీల గురించి ప్రస్తావించకుండా ఎదుటివ్యక్తిని నిందించలేని దౌర్భాగ్యులు వీళ్లు. తమలోని అన్ని రకాల అసహ్యాలూ ఎదుటి మనుషుల మీద ఒలకబోసే మానసిక రోగులు వీళ్లు.
వీళ్లు కోపపడడానికి కూడా అర్హత లేనివాళ్ళు. వీళ్లని మనుషులుగా లెక్కలోకి తీసుకోకపోవడమే మనమిచ్చే సమాధానం. అయితే ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఒక గుణపాఠం తప్పక నేర్పి తీరాలి.
-సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్