హిందూత్వ రాజకీయాల ధృవతార బలరాజ్ మధోక్!

భారత రాజకీయాలలో హిందుత్వ సైద్ధాంతిక ప్రాతిపదికతో బలమైన రాజకీయ ప్రత్యామ్న్యాయం ఏర్పాటుకు అవిరళ కృషిచేసిన మేధావి, విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు, వీరోచిత పోరాట యోధుడు ప్రొఫెసర్ బలరాజ్ మధోక్. విదేశీ సైద్ధాంతిక ఆలోచనలు భారత రాజకీయ రంగాన్ని ముంచి వేస్తున్న రోజులలో ప్రత్యామ్న్యాయ సామజిక, రాజకీయ, ఆర్ధిక విలువలతో బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటుకు విఫల ప్రయత్నం చేశారు. డా. శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ తో కలసి భారతీయ జనసంఘ్ ను స్థాపించి, దానికి ఒక […]

Written By: Neelambaram, Updated On : February 25, 2020 11:50 am
Follow us on


భారత రాజకీయాలలో హిందుత్వ సైద్ధాంతిక ప్రాతిపదికతో బలమైన రాజకీయ ప్రత్యామ్న్యాయం ఏర్పాటుకు అవిరళ కృషిచేసిన మేధావి, విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు, వీరోచిత పోరాట యోధుడు ప్రొఫెసర్ బలరాజ్ మధోక్. విదేశీ సైద్ధాంతిక ఆలోచనలు భారత రాజకీయ రంగాన్ని ముంచి వేస్తున్న రోజులలో ప్రత్యామ్న్యాయ సామజిక, రాజకీయ, ఆర్ధిక విలువలతో బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటుకు విఫల ప్రయత్నం చేశారు.

డా. శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ తో కలసి భారతీయ జనసంఘ్ ను స్థాపించి, దానికి ఒక విలక్షణమైన సైద్ధాంతిక రూపు కలిగింఫంచారు. అమెరికా, ఇజ్రాయెల్ లు భారత్ కు `సహజ మిత్రులు’ అని, వారితో భారత్ దేశం సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని దేశం అంతా రష్యా, చైనా మత్తులలో ఉన్న సమయంలోనే బలంగా వాదించిన నేత.

అయోధ్యలో రామమందిరం నిర్మించాలని పార్లమెంట్ లో మొట్ట మొదటిగా సెప్టెంబర్ 1, 1961న వాదించిన నేత. అయోధ్యతో పాటు కాశి, మథుర లను సహితం హిందువులకు ఇచ్చివేయడం ద్వారా భారతదేశంలో పరస్పరం సుహృధభావం కలిగి ఉండేందుకు చేతులు కలపాలని ముస్లింలకు పిలుపిచ్చిన మొదటి నేత.

హిందువులలో రాజకీయ చైతన్యం అవసరమని మొదటగా చెప్పారు. `సాంస్కృతిక హిందుత్వ’ అంటే విస్తృతమైన అంశమని, నేడు భారతీయులకు అవసరమైనది బలమైన రాజకీయ సందేశం అని స్పష్టం చేశారు. దేశ విభజనకు కారణమై, ఇంకా దేశంలోనే ఉంటున్నవారు హిందువులతో పాటు సమానమైన ఆదరణ మాత్రమే పొందగలరని కూడా నిక్కచ్చిగా చెప్పారు.

1946లోనే ముస్లిం సమస్యను చారిత్రక దృక్కోణంలో అధ్యయనం చేసి ఆయన లాహోర్ లో వ్రాసిన వ్యాసం ఇండియన్ లిబరల్ లీగ్ నుండి మొదటి బహుమతి పొందింది. “నేటి మూల సమస్య భారతీయ ఇస్లాం భారతీయకరణ పూర్తిగా జారకపోవడం. అదే జాతీయవాద శక్తులను బలహీన పరుస్తున్నది. తిరోగమన, జాతి వ్యతిరేక శక్తులకు బలం చేకూరుస్తుంది” అంటూ నిర్మోహాటంగా తన భావాలను వ్యక్తం చేశారు.

“బలహీనమైన విధానాలు ఏ సమస్యను పరిష్కరింపలేవు. సరైన మార్గం తీసుకొని, దారిలో వచ్చే అడ్డంకులను తొలగించుకొంటూ వెళ్లగల మనోబలం, శక్తీ దేశానికి నేడు అవసరం” అని కూడా చెప్పారు. జాతీయత ఇటలీ, జర్మనీలను ఐక్య పరిస్తే, ముస్లిం వేర్పాటువాదం భారత దేశ విభజనకు దారితీసిన్నట్లు ఆయన తెలిపారు.

రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలని కోరుకొంటున్న వారు ముందుగా దేశాన్ని నిజమైన లౌకిక రాజ్యంగా మారల్చాలని మధోక్ కోరారు. లౌకిక రాజ్యంలో పౌరుల మధ్య మతం పేరుతో వివక్షత చూపడం తగదని, అందరికి ఒకేరకమైన చట్టాలు ఉండాలని, చట్టం ముందు అందరు సమానమే అని స్పష్టం చేశారు. లౌకికవాదులం అని చెప్పుకొనే వారు మతాన్ని, రాజకీయాలను మిళితం చేయడమే నేడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని చెప్పారు.

భారత రాజకీయ వ్యవస్థ విదేశీ సైద్ధాంతిక జడివానలో కొట్టుకు పోతున్న తరణంలో అసలైన భారతీయ ఆర్ధిక, సామజిక, రాజకీయ విలువలతో ప్రత్యామ్న్యాయ రాజకీయాల కోసం తపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ రాజకీయాలకు భిన్నమైన రాజకీయ పక్షం ఏర్పాటు కోసం విశేషంగా ప్రయత్నం చేశారు.

అయితే సిద్ధాంతాల ముసుగులో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవారు, సిద్ధాంతం ముసుగులో భజనప్రియులను మాత్రమే ప్రోత్సహిస్తున్నవారు ఆయనను పక్కకు తప్పించడంతో భారత రాజకీయ రంగం అవకాశం రాజకీయాల వేదికగా ఉండిపోయింది. సైద్ధాంతిక భూమికపై, విలువల ప్రాతిపదికన రాజకీయాలు నడిపే నాయకత్వం కనిపించకుండా పోయింది. సైద్ధాంతిక అంశాలపై రాజీలేని ధోరణి ఆవలభించడం ఆనాటి ఆర్ ఎస్ ఎస్, జనసంఘ్ నాయకులకు నచ్చలేదు.

ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న స్కర్దులో 1920, ఫిబ్రవరి 25న జన్మించిన ఆయన శ్రీనగర్, లాహోరుల్లో చదువుకున్నారు. 1940లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి 1942లో ప్రచారక్‌గా వెళ్లారు. జమ్మూకశ్మీర్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి ఒక దశలో షేక్ అబ్దుల్లా ప్రయత్నించాడు.

జమ్మూలో ప్రజాపరిషత్ స్థాపకులలో ఒకరైన ఆయన 1949లో ఢిల్లీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ప్రారంభించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి, వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1951లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీలో జరిపిన మొదటి సదస్సుకు కన్వీనర్‌గా ఉన్నారు.

ఇద్దరు ఉద్దండులైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత దీన దయాళ్ ఉపాధ్యాయలతో కలిసి పనిచేశారు. వారిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం గమనార్హం.
జనసంఘ్‌కు విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక భూమికను ఏర్పరచడం కోసం ప్రయత్నించారు. పార్టీ మొదటి ఎన్నికల ప్రణాళికను ఆయన తయారుచేశారు.

రెండుసార్లు ఢిల్లీనుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసంఘ్ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో 35 స్థానాలు గెలుచుకొని వివిధ రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగింది.

దేశవిభజన సమయంలో విద్రోహానికి గురయి, మారణహోమానికి గురయిన హిందువులు, సిక్కుల పక్షాన నిలబడి వారి భద్రతకోసం అవిరామంగా పోరాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆయన ప్రముఖులు. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ఉద్యమకారుడిగా పాకిస్తాన్ సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ భారతీయ సైన్యానికి అందజేస్తూ ఉండేవారు. 2016 మే 2న ఢిల్లీలో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.