https://oktelugu.com/

Dasara Festival 2023: దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.. పండితులు ఏం చెప్తున్నారు..

అక్టోబర్‌ 23, 24 తేదీల్లో ఏరోజు కూడా దశమి తిథి లేదు. దీంతో కన్ఫ్యూజన్‌ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ యోగం ఉన్న రోజున పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 19, 2023 4:59 pm
    Dasara Festival 2023

    Dasara Festival 2023

    Follow us on

    Dasara Festival 2023: తెలుగువారి పండుగల్లో అతి ప్రాముఖ్యమైన, తెలంగాణ రాష్ట్ర పండుగ దసరా. వాడవాడలా అమ్మవారిని నిలబెట్టి శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే విజయ దశమి దసరా పండుగ ఏరోజు జరుపుకోవాలన్న సందిగ్ధం కొనసాగుతోంది. మొన్న వినాయక చవితి విషయంలోనూ ఇదే సందిగ్ధం నెలకొంది. తాజాగా దసరా విషయంలో ఈసారి కన్ఫ్యూజన్‌ నెలకొంది.

    అధిక మాసం కారణంగా..
    ఈ ఏడాది అధికమాసం రావడంతో అన్ని పండుగలు రెండు రోజులు వస్తున్నాయి. అలాగే దసరా కూడా 23న లేదా 24న అనే సందిగ్ధత ఏర్పడింది. విజయదశమి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే 23వ తారీఖున నవమి తిథి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. 24న నవమి తి«థి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంది. నిర్ణయ సింధు, ధర్మ సింధు ప్రకారం మధ్యాహ్నానికి దశమి తిధి ఉండే రోజున విజయదశమిగా జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది.

    దశమి లేనందున..
    అయితే అక్టోబర్‌ 23, 24 తేదీల్లో ఏరోజు కూడా దశమి తిథి లేదు. దీంతో కన్ఫ్యూజన్‌ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ యోగం ఉన్న రోజున పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే 23న శ్రావణ యోగం ఉంది. దీని ఆధారంగా దసరా పండుగ విజయదశమిని ఈనెల 23న జరుపుకోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం తర్వాత దశమి తిథి ఉన్నా కూడా పూర్వదినాన్ని గ్రహించాలని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే 23వ తేదీనే మహర్నవమి, అదే రోజు విజయదశమి కూడా జరుపుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.

    పాలపిట్టకు ప్రాధాన్యం..
    దసరా పండుగ అనగానే తెలంగాణలో పాలపిట్ట గుర్తొస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. దసరా పండుగ రోజున ఈ పక్షిని చూస్తే అన్నీ విజయాలే కలుగుతాయని తెలంగాణ వాసుల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు తెలంగాణవాసులంతా ఊరి శివారులోకి వెళ్లి పాలపిట్టను చూస్తున్నారు. ఇక కేసీఆర్‌ అయితే ఈ పాలపిట్టను పంజరంలో తెప్పించుకుని మరీ దర్శిస్తున్నారు.