తెలుగువారి పండుగలలో ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పండుగతోనే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ రోజు పురోహితులు పంచాంగ శ్రవణం చేస్తారు. అసలు ఈ ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకోవడానికి మన పురాణాలలో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం….
పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా బ్రహ్మదేవుడు రచించిన వేదాలను సోమకుడు అపహరించి సముద్రగర్భంలో దాక్కుంటాడు. అయితే ఆ వేదాలను రక్షించడం కోసం విష్ణుమూర్తి మత్స్య అవతారంలో సముద్ర గర్భంలోకి వెళ్లి సోమకుడు సంహరించి వేదాలను భద్రంగా బ్రహ్మకు అప్పగించారు.విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తినది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కనుక ఈ రోజున తెలుగు ప్రజలు ఉగాది పండుగను జరుపుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది పండుగ ఎంతో ముఖ్యమైనది.
ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 13న జరుపుకుంటారు. ఉగాది తిథి ఏప్రిల్ 12 ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై 13వ తేదీ ఉదయం10:16 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 13న శార్వరి నామ సంవత్సరం ముగిస్తూ.. ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
ఉగాది పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజు ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత. ఆరు రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలో ఎదుర్కొనే అన్ని అనుభవాలను సూచిస్తుంది. ఇందులో వాడే ఒక్కో రుచి మన జీవితంలో జరిగే ఒక సంఘటనకు ప్రతీకగా భావిస్తారు. అందుకోసమే ఉగాది పండుగకు ప్రత్యేక నైవేద్యంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. మరి ఈ పచ్చడిలో ఉపయోగించే ఆరు రుచులు దేనికి ప్రతీకనో ఇక్కడ తెలుసుకుందాం..
* బెల్లం_తీపి-మన జీవితంలో జరిగే ఆనందానికి ప్రతీక.
* చింతపండు-పులుపు-జీవితంలో అన్ని విషయాలలో ఎంతో నేర్పుగా ఉండాలని సూచిస్తుంది.
* ఉప్పు-జీవితంలో ఎంతో ఉత్సాహంగా, రుచిని తెలియజేస్తుంది.
* పచ్చి మామిడి ముక్కలు-వగరు- మన జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను అధిగమించడానికి ప్రతీక.
* కారం-సహనం కోల్పోయే పరిస్థితులను ఎదుర్కోవడం
* వేపపువ్వు-చేదు-జీవితంలో బాధలు కలిగించే అనుభవాలకు గుర్తు.
ఈ విధంగా ఆరు రుచులతో కలిపి ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సభ్యులు ఈ పచ్చడిని ప్రసాదంగా భావిస్తారు
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More