Ugadi : హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ఉగాది గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. సృష్టిని ఈ రోజు బ్రహ్మదేవుడు ప్రారంభించాడని చెబుతారు. చైత్ర శక్ల పక్ష పాడ్యమి నాడు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఇదే రోజు శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని చెబుతుంటారు. తెలుగు సంవత్సరాదిగా పిలుస్తారు. అందరు ఆంగ్ల సంవత్సరాన్ని తమ నూతన సంవత్సరంగా భావించినా తెలుగువారి కొత్త సంవత్సరం మాత్రం ఉగాదే. పంచాంగం ప్రకారం ఈ రోజు నుంచే మన క్యాలెండర్ మొదలవుతుంది.
ఉగాది ప్రతి ఒక్కరికి ప్రీతిపాత్రమైన పండుగ. ఈ పండుగకు కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసొస్తుంది. ఈ రోజు ఒక కొబ్బరికాయను తీసుకొచ్చి ఎర్రని గుడ్డలో చుట్టి బీరువాలో పెడితే సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయని నమ్మకం. ఉగాది రోజు ఇనుముతో తయారు చేసిన తాబేలును ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. బ్రాస్ తాబేలును తెచ్చుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇంకా ఉగాది నాడు లాఫింగ్ బుద్ధ లాంటి విగ్రహాన్ని తెచ్చి పెట్టుకున్నా శుభాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని సరైన స్థానంలో ఉంచితే మంచి జరుగుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. ఉగాది రోజు తులసి మొక్కను ఇంట్లో నాటుకోవడం మంచిదని భావిస్తారు. తులసి శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైనదిగా చెబుతారు. అందుకే ఈ రోజు తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోవడం శుభంగా పరిగణిస్తారు.
ఉగాది రోజు దక్షిణావృత శంఖం తెచ్చుకుంటే కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఇది మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది. ఉగాది రోజు నెమలి ఈకలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. నెమలీకలు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి కూడా ఇవి ఇష్టం కావడంతో వీటిని తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే వీటిని పాటించి పండుగ రోజు మంచి ఫలితాలు అందుకునేందుకు అనుకూల పరిస్థితులు కల్పించుకోవాలి.