
Pawan Kalyan- BJP: ఎవరైనా రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకోవడం చూస్తుంటాం. రాజకీయాల్లో అవసరాలు తప్పితే మరొకటి ఉండదు కూడా. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రం కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అది ఎన్నికల తరువాత అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. రాష్ట్ర హితం కోసం ఎన్నికల వరకూ వామపక్షాలతో కలిసి నడిచిన పవన్ సాహోసేపేత నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనా వైఫల్యాలను నియంత్రించి గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ సాయం అక్కరకు వస్తుందని గుర్తించి ఈ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ, జనసేన కలిసి నడవాలని ఉభయులు ఒక అంగీకారానికి వచ్చారు. ఒక సమన్వయ కమిటీని సైతం ఏర్పాటుచేశారు. అయితే ిది తొలి సమావేశానికే పరిమితమైంది. అటు తరువాత రెండు పార్టీలు కలిసి పనిచేసినట్టు ఎప్పుడూ కనిపించలేదు. వైసీపీ తన మార్కుపాలనతో నాలుగేళ్లు పూర్తిచేసింది. బీజేపీ నుంచి పవన్ కు ఆశించినంత సపోర్టు కూడా లేకపోయింది. ఫలితంగా నాలుగేళ్లలో జనసేన, బీజేపీ పొత్తు ఫలితాలు ఎక్కడా కనిపించలేదు. కనీసం అందుకు తగ్గట్టు సానుకూల వాతావరణం ఎక్కడా ఏర్పడలేదు.
తిరుపతి ఉప ఎన్నికల రూపంలో రెండు పార్టీలు కలిసి సత్తా చూపే మంచి చాన్స్ వచ్చింది. అక్కడ కూడా జనసేన, పవన్ సేవలను ఉపయోగించుకోవడంలో బీజేపీ సరైన ప్రణాళికతో వెళ్లలేదు. కేవలం సొంత అజెండాతోనే ముందడుగు వేసింది. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానంలో బీజేపీకి వచ్చిన ఓట్లు 16 వేలు. ఉప ఎన్నికల్లో జనసేన తమతో ఉందని ప్రచారం చేసుకోవడంతో ఓట్ల సంఖ్య 57 వేలకు చేరుకుంది. పవన్ కు అత్యంత బలమున్న ప్రాంతంలో తిరుపతి ఒకటి. కానీ పవన్ ఫొటోను మాత్రమే ఉప ఎన్నికలో వాడుకున్నారు. కానీ పవన్ ను కలుపుకొని వెళ్లేంత చతురతను రాష్ట్ర బీజేపీ నాయకులు చూపించలేకపోయారు. దీంతో ఇక్కడ ప్రతికూల ఫలితాన్ని మూటగట్టుకున్నారు.

రెండు పార్టీలు కలిసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో అవకాశం వచ్చింది. అప్పుడు కూడా పొత్తులు కుదుర్చుకోలేదు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తామని బీజేపీ చెప్పిందే కానీ.. జనసేనతో కలిసి వెళ్లి గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుందామన్న ప్రయత్నం చేయలేదు. కానీ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో స్థానిక జనసేన, టీడీపీ నాయకులు కలిసి పోటీచేశారు. చెప్పుకోదగ్గ విజయాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వర్కవుట్ అవుతుందన్న భావన వచ్చింది. అది అధినాయకత్వాలకు చేరింది. టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతావరణానికి నాటి స్థానిక సంస్థల ఎన్నికలే ప్రభావితం చూపాయన్న టాక్ ఇప్పటికీ వినిపిస్తుంది.
తాను సొంతంగా పోటీచేయడానికి అవసరమైన సాయాన్ని బీజేపీ అందించి ఉంటే టీడీపీతో పని లేకుండా ఉండేదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. టీడీపీ అవసరం లేకుండా తాను ముందుకెళ్లాలని బీజేపీకి తేల్చిచెప్పారు. అందుకు భారతీయ జనతా పార్టీనే బాధ్యులు చేశారు. కవాతు నిర్వహించడానికి, రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు బీజేపీ ముందుకు రాలేదు. వైసీపీ విచ్చలవిడితనానికి బీజేపీ అడ్డుకట్ట వేయకపోవడం వల్లే రాష్ట్రం అధోగతికి గురైందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలపై దాడులు పెరిగితే చూస్తూ ఉండలేమని హెచ్చరించడం ద్వారా కూడా తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటించలేదన్నది పవన్ బాధ. ప్రస్తుతం వైసీపీని ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తియుక్తులను ఇవ్వకపోవడం వల్లే టీడీపీతో కలిసి వెళ్లాల్సి వచ్చిందని కూడా పవన్ స్పష్టం చేశారు. పవన్ నిర్ణయానికి కర్త, కర్మ, క్రియ భారతీయ జనతా పార్టీయేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.