Homeపండుగ వైభవంNavratri 2023: నవరాత్రుల్లో.. దుర్గా దేవిని ఎలా పూజించాలో తెలుసా?

Navratri 2023: నవరాత్రుల్లో.. దుర్గా దేవిని ఎలా పూజించాలో తెలుసా?

Navratri 2023: భక్తుల ప్రార్థన మేరకు… దుర్గాదేవి ఈ భూమిపై తొమ్మిది సార్లు అవతరిచింది. రాక్షస సంహారం చేసింది. దీనికి చిహ్నంగా… దుర్గా సప్తశతిలోని దేవీకవచంలో ప్రస్తావితమైన…
ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మ చారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతిచాష్టమం
నవమం సిద్ధిధాత్రీ చ నవ దుర్గాః ప్రకీర్తితాః …అనే శ్లోకానుసారం… నవదుర్గా రూపాలతో పూజిస్తారు.
ఈ సంప్రదాయం శక్తిపీఠాలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ రూపాలు, వాటి విశిష్టతల గురించి ఈ నవరాత్రి వేడుకల సందర్భంగా తెలుసుకుందాం.

మొదటి రోజు – శైల పుత్రి:

శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె. ఆమే పార్వతీ దేవి. నవదుర్గల్లో మొదటి అవతారం. ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంది. శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో తామరపువ్వును ధరించి ఉంటుంది.
వృషభ వాహనంపై… చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది.

రెండో రోజు – బ్రహ్మచారిణి:

నిరంతరం తపోదీక్షలో ఉండే దేవత బ్రహ్మచారిణి. ‘బ్రహ్మము’ అంటే తపస్సు, ‘చారిణి’ అంటే ఆచరించేది అని అర్థం. ఆమె కుడిచేతిలో జపమాలను, ఎడమ చేదిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది. ఆమెనే ఉమాదేవి అని పిలుస్తారు. తనను
ఆరాధించే భక్తులకు జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తుంది.

మూడో రోజు – చంద్రఘంట:

ఈ రూపంలో దుర్గమాత
పది చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. బంగారు
కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ… ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి, మిగిలిన రెండు చేతులతో భక్తులకు అభయం ఇస్తుంది. పులి వాహనంపై ఆసీనురాలైన
చంద్రఘంట భక్తులకు శాంతిని, శుభాన్ని చేకూరుస్తుంది.

నాలుగో రోజు – కూష్మాండ దేవి:

కూష్మాండదేవి రూపంలోని దుర్గామాత… సింహవాహిని. సౌర వ్యవస్థను తన
ఆధీనంలో ఉంచుకొని, చుట్టూ సూర్యకాంతిని వెదజల్లుతుంది. ఆమెకు ఎనిమిది చేతులు. ఆరు చేతుల్లో ఆయుధాలను,
మిగిలిన రెండు చేతుల్లో తామర పువ్వు, జపమాలను ధరించి ఉంటుంది. తెల్ల గుమ్మడి అంటే ఆమెకు ఇష్టం కాబట్టి ‘కూష్మాండ దేవి’ అని పిలుస్తారు.

అయిదో రోజు – స్కందమాత:

స్కందుడు అంటే కుమారస్వామికి తల్లిగా… స్కందమాత రూపంలో అమ్మవారిని కొలుస్తారు.
ఆమెకు మూడు నేత్రాలు, నాలుగు చేతులు. రెండు చేతుల్లో తామర పూలు ధరించి, రెండు చేతులతో భక్తులకు ఆశీస్సులను, అభయాన్ని ప్రసాదిస్తుంది. ఆమె వాహనం సింహం.
ఆ తల్లి అనుగ్రహంతో మూర్ఖులు కూడా జ్ఞానులవుతారు.
ఆమె కటాక్షంతోనే కాళిదాసు మహాకవి అయ్యాడు.

ఆరో రోజు – కాత్యాయని:

కాత్యాయన మహర్షి దీర్ఘకాలం పాటు చేసిన కఠోర
తపస్సుకు జగన్మాత ప్రసన్నురాలైంది. ఆ మహర్షి కోరిక మేరకు ఆయన కుమార్తెగా జన్మించి… కాత్యాయని అయింది. ఆమెకు మూడు కళ్ళు, నాలుగు చేతులు ఉంటాయి.
వజ్రమండల దేవతగా పూర్వులు పేర్కొన్న ఆమె సింహాన్ని అధిష్టించి ఉంటుంది.

ఏడో రోజు – కాళరాత్రి:

ఆదిశక్తిని దేవతలు ‘‘దేవీ! నీవెవరివి?’’ అని అడిగినప్పుడు ‘‘నేను ఆనందాన్ని. దానికి అతీతమైన పరమానందాన్ని, నేను జ్ఞానాన్ని. దానికి అతీతమైన బ్రహ్మ జ్ఞానాన్ని’’ అని చెబుతుంది. ఈ రూపంలో అమ్మవారి శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. కాబట్టి ఆమెను ‘కాళరాత్రి’ అంటారు. జుత్తు విరగబోసుకొని, నాసిక ద్వారా అగ్ని జ్వాలలు వెదజల్లుతూ… అంధకారాన్నీ, అజ్ఞానాన్నీ నాశనం చేస్తుంది.

ఎనిమిదో రోజు – మహాగౌరి:

మల్లెపువ్వులా తెల్లటి రంగులో, చంద్ర కాంతితో ప్రకాశించే మహా గౌరి మూడు నేత్రాలు, నాలుగు చేతులను కలిగి, వృషభ వాహనాన్ని అధిష్టించి ఉంటుంది. త్రిశూలం, కమండలం ధరించిన ఆమె తెల్లని లేదా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి… భక్తులను కటాక్షిస్తుంది. ఈ రోజు ‘దేవీ మహాత్మ్యం’లోని పదకొండో అధ్యాయాన్ని మననం చేసుకుంటూ, అమ్మవారిని ప్రార్ధన చేయాలి.

తొమ్మిదోరోజు – సిద్ధి ధాత్రి:

నవదుర్గల్లో తొమ్మిదవ రూపమైన సిద్ధిధాత్రిని మహాశక్తి’ అని కూడా పిలుస్తారు. అణిమాది అష్టసిద్ధులను ఆమె ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు ఆ మహా శక్తిని ఆరాధించి… ఈ అష్ట సిద్థులను పొందాడని దేవీ పురాణం చెబుతోంది. ఆమె సింహాన్ని అధిరోహించి ఉంటుందని కొన్ని, కమలంపై ఆసీనురాలై ఉంటుందనీ మరికొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతి కోరుకొనేవారు ఆమెను ఆరాధించాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular