Johnny Master : ఎన్నికల్లో జనసేనకు సినీ పరిశ్రమ ఏకపక్షంగా మద్దతు తెలిపింది. ఒకరిద్దరు తప్పించి పరిశ్రమ యావత్ జనసేనతో పాటు కూటమి గెలవాలని ఆకాంక్షించింది. ముఖ్యంగా పవన్ కు మద్దతు పెరిగింది. కొందరైతే ప్రత్యక్షంగాను జనసేనకు అండగా నిలబడ్డారు. మరికొందరైతే పార్టీలో చేరి సేవలందించారు. బుల్లితెర నటులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు జనసేనకు మద్దతుగా ప్రచారం చేశారు. సినీ పరిశ్రమకు సంబంధించి మెగా కుటుంబంతో అనుబంధం ఉన్నవారు మద్దతు తెలిపారు. జబర్దస్త్ నటులు పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. సినీ పరిశ్రమకు సంబంధించి జానీ మాస్టర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ జనసేనకు స్టార్ క్యాంపైనర్లు అయ్యారు. ఇందులో జానీ మాస్టర్ ఎన్నికల ముందు నుంచే జనసేనకు మద్దతుగా నిలిచారు. అప్పటి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తారు.జనసేన అధికారంలోకి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం గా పవన్ ప్రమాణస్వీకారం చేయడాన్ని స్వాగతించారు. 2029 నాటికి పవన్ సీఎం అవుతారని కూడా జానీ మాస్టర్ ఇటీవల జోస్యం చెప్పారు. అయితే అటువంటి జానీ మాస్టర్ పై జనసేన నాయకత్వం చర్యలకు ఉపక్రమించడం విశేషం.
* నేరుగా పోలీసులకు ఫిర్యాదు
తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని.. ఓ మహిళ జూనియర్ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేశారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అవుట్ డోర్ షూటింగ్ ల సమయంలో తనను లొంగదీసుకునే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకొచ్చారు. నేరుగా ఇంటికి వచ్చి సైతం లైంగిక దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కిందకేసు నమోదు చేశారు.
* టార్గెట్ చేసిన వైసిపి
అయితే జానీ మాస్టర్ పై తాజాగా వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన వైసీపీకి టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రచారం ప్రారంభమైంది. ఇది జనసేనకు ఇబ్బందికరంగా మారింది. జానీ మాస్టర్ ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపైనర్ కావడం.. గతంలో వైసిపి పై ఆరోపణలు చేసి ఉండడంతో.. ఇప్పుడు వైసీపీ ఆయనపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది. దీంతో జనసేన ఆత్మరక్షణలో పడింది.
* జనసేన కీలక ప్రకటన
జానీ మాస్టర్ పై ఆరోపణలు నేపథ్యంలో జనసేన కీలక ప్రకటన చేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని జనసేన కాన్ఫిలిక్స్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. దీంతో జానీ మాస్టర్ పై పార్టీ సీరియస్ గా ఉన్నట్లు అర్థమైంది.
*:గతంలో కూడా కేసు
జానీ మాస్టర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి.గతంలో కూడా చాలా వరకు కేసులు నమోదయ్యాయి.ఓ కళాశాలలో మహిళపై దాడి చేయడం అప్పట్లో సంచలనం గా మారింది. దీనిపై కేసు కూడా నమోదయింది. ఇప్పుడు తన వద్ద పనిచేస్తున్న జూనియర్ కొరియోగ్రాఫర్ నేరుగా లైంగిక ఆరోపణలు చేయడంతోజానీ మాస్టర్ ఇరుక్కున్నారు. దీనిపై నిజనిర్ధారణ వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ప్రకటించడం విశేషం. అయితే దీనిపై జానీ మాస్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.