Chiranjeevi Godfather: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ ఈ దసరా కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరు ప్రమోషన్ ను పట్టాలెక్కించాడు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలోని ఓ డైలాగ్ ను ఆడియో రూపంలో విడుదల చేయగా వైరల్ అయ్యింది. చిరంజీవిని, రాజకీయాలకు ముడిపెట్టి పలికిన ఈ డైలాగ్ ను తలోరకంగా అన్వయించుకొని రచ్చ చేసిపడేశారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం సాగింది. ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ తరుఫున బరిలోకి దిగుతాడని కథలు కథలుగా చెప్పుకొచ్చారు.

‘గాడ్ ఫాదర్ ’ సినిమాలో రాజకీయ డైలాగ్ పై మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు స్పందించారు. తన డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకోలేదన్నారు. అయినా ఇదీ ఓ రకంగా మంచిదేనన్నారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్నాను. రాజకీయం నాకు దూరం కాలేదు’ అన్న సినిమా డైలాగ్ ఇటీవల తెలుగు రాష్ట్రాలను ఊపు ఊపేసింది. అది సినిమాలోనిది మాత్రమేనంటూ.. ప్రమోషన్ కోసం విడుదల చేసినట్టు చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
ఇక తెలంగాణలో ఇటీవల సినిమా ప్రమోషన్లకు ఆటంకాలు కలుగుతున్నాయి. ‘బ్రహ్మోస్త్ర’ ఈవెంట్ ను రామోజీ ఫిలింసిటీలో నిర్వహణకు అన్నీ సిద్ధం చేసిన వేళ తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ కు అనుమతులు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఏపీలో తనకు ఎంతో ఆప్తుడైన జగన్ ప్రభుత్వం ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఏపీలో నిర్వహించేందుకు సిద్ధపడ్డాడు. ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుంచి అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఈ వేడుక నిర్వహించాలని డిసైడ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ వేడుకను ఆంధ్రాలో నిర్వహించాలని డిసైడ్ కావడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశాడు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరమన్నాడు. ఆయనకు నా శుభాకాంక్షలు చెబుతున్నట్టు తెలిపారు. నాలుగున్నర దశాబ్ధాలుగా చిత్రసీమను రంజింపచేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం.. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ కొనియాడారు.
ఓవైపు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూనే ఆయన అన్నయ్య చిరంజీవి సినిమాలను, ఆయనను రాజకీయంగా వాడుకుంటున్న వైసీపీ నేతల తీరు చూసి మెగా ఫ్యాన్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.