YRF: ఇటీవల కాలంలో ఓటీటీల హవా జోరుగా సాగుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి థియేటర్లన్నీ మూతపడ్డాయి. మెల్లగా ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నప్పటికీ.. కొవిడ్ భయం వల్ల పెద్దగా థియేటర్లకు రావడం లేదు. దానికి తోడు, ఓటీటీల్లోనే తక్కువ ధరకు బోలెడన్నీ సినిమాలు అందుబాటులో ఉండటంతో.. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే విడుదల చేసేందుకు ప్రస్తుతం దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. దీంతో, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మంది నిర్మాతలకు ఓటీటీలు వరంగా మారాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు.

చిన్న సినిమాలే కాదు, పెద్ద నిర్మాణ సంస్థలూ ఈ ప్లాట్ఫామ్వైపే అడుగులేస్తున్నాయి. తాజాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ఫిల్మ్స్ ఓటీటీ సినిమాల కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కాగా, నిర్మాత ఆదిత్య చోప్రా రూ.500కోట్లతో ప్రణాళిక వేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
కాగా, యశ్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. 1973లో చిత్ర సీమలో అడుగు పెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత వరుసగా హిట్ చిత్రాలు తెరకెక్కించి.. ప్రస్తుతం బాలీవుడ్లోని నిర్మాణ సంస్థలో అగ్రగామిగా నడుస్తోంది. కాగా, ఈ నిర్మాణ సంస్థలో చారిత్రక అంశాలపై ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కాగా, ప్రస్తుతం సంషేరా, పఠాన్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, మహారాజా, టైగర్ 3 వంటి సినిమాలను తెరకెక్కిస్తోంది.