Revanth Reddy పుష్ప -2 సినిమా చూశారా.. అందులో ముఖ్య మంత్రి పక్కన ఫోటో దిగడానికి ఒప్పుకోలేదని.. అల్లు అర్జున్ తనకున్న డబ్బు బలంతో ఏకంగా ముఖ్యమంత్రిని మార్చేస్తాడు. అదంటే సినిమా కాబట్టి … లిబర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అలా తీశారు. కానీ రీల్ లైఫ్ లో జరిగినట్టుగా రియల్ లైఫ్ లో జరగదు. అయితే సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఒక్కసారి గా పరిస్థితులు మారిపోయాయి. తగ్గేదేలే అని డైలాగ్ పలికిన అల్లు అర్జున్ చేత.. తగ్గించేలా చేశాయి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేశాయి. కోర్టు గడప తొక్కేలా చేశాయి. చివరికి జైల్లో కొన్ని గంటలసేపు ఉండేలా చేశాయి. అయితే ఈ పరిణామాలు ఇక్కడితోనే ఆగిపోవని.. ఇంకా చాలా జరుగుతాయని ఓ.అడ్వకేట్ చెప్పారు.. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి పాదూరి. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు. అల్లు అర్జున్ కేస్ తర్వాత జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి మంగళవారం హైదరాబాదులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. పుష్ప సినిమా మాదిరిగానే తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.. అల్లు అర్జున్ ను ఓ మహా శక్తి నడిపిస్తోందని.. అందువల్లే ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఇంతకీ ఆ మహా శక్తి ఎవరు అనే విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించలేకపోయారు. మొత్తానికైతే ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఆయన లీకులు ఇచ్చారు.
సమసి పోయిందనుకున్న సమయంలో..
సంధ్య థియేటర్ ఉదంతం ముగిసింది అనుకుంటున్న తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ విషయంపై ప్రముఖంగా ప్రస్తావించారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఆయన తప్పు పట్టారు. అంతేకాదు సినిమా పరిశ్రమ లోని వ్యక్తుల తీరును ఆయన ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడిన అనంతరం.. అల్లు అర్జున్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయింది. అరవైపు చిక్కడపల్లి పోలీసులు మంగళవారం హీరో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఆ తర్వాత గంటల తరబడి విచారించారు. ఈ విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ” అల్లు అర్జున్ ఓ రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారారు అనిపిస్తోంది. పుష్ప సినిమాలో లాగానే రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది. గత 24 గంటల్లో దీనికి సంబంధించి భారీగానే స్కెచ్ రెడీ అయింది. అల్లు అర్జున్ వెనుక ఒక శక్తి దాగి ఉంది. వచ్చే వారం రోజుల్లో రేవంత్ సర్కార్ ను పడగొట్టడానికి పెద్ద కుట్ర చేశారు. ఈ వారంలో గులాబీ, బిజెపి నాయకులు తమ అనుకున్న పని చేస్తారు. అల్లు అర్జున్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా అల్లు అర్జున్ కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా నిలబడాలి. వారికి అండగా నిలబడిన వారే నిజమైన తెలంగాణ వాదులు.. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని” శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తనపై ఎలాంటి కేసులు పెట్టినా భయపడనని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.
పుష్ప 2లో చూపించినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చే కుట్ర చేస్తున్నారు – అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి pic.twitter.com/ycY7SoUWWr
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024