Pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కరోనా కారణంగా ఎంతో కాలం వాయిదా పడిన ఈ మూవీ.. ఆ తర్వాత రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి పార్ట్ ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని డిసైడ్ చేశారు. కానీ.. ఇప్పుడు ఆ డేట్ మారుతోందని టాక్.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాతణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే అలారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు.
ఇక, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ గా వచ్చిన దాక్కో దాక్కో మేక అనే పాట కూడా అలరించింది. దసరా నేపథ్యంలో మరో పాటను కూడా రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ పై ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది.
దీనికి బాలీవుడ్ థియేటర్ తలుపులు తెరుచుకోవడమే కారణంగా తెలుస్తోంది. అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. దీంతో.. విజయదశమి టార్గెట్ గా పలు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అప్పటి నుంచి వరుసగా బాక్సాఫీస్ వద్ద యుద్ధం మొదలు కానుంది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ‘83’ చిత్రం విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
దీంతో.. పుష్పపై ఈ మూవీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించారు. స్ట్రయిట్ చిత్రమైన 83కే బాలీవుడ్ ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉంది. అందువల్ల పుష్ప చిత్రం విడుదల తేదీని మార్చాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని టాక్. ఒక వారం ముందుగా డిసెంబర్ 17వ తేదీన పుష్పను వదిలేందుకు చూస్తున్నారని సమాచారం. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది చూడాలి.