Manchu Vishnu MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈసారి అధ్యక్ష బరిలో ఆయన లేరట. నెక్స్ట్ మా ఎలక్షన్స్ లో పోటీ చేయబోవడం లేదని తేల్చి చెప్పేశారట. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ సభ్యులకు తన నిర్ణయం తెలియజేశాడట. ఇటీవల విడుదలైన టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాల కారణంగానే మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎప్పటి నుండో పరిశ్రమలో ఉన్న సి. కళ్యాణ్ ని దిల్ రాజు ఓడించారు. నిజానికి సి. కళ్యాణ్ కి గట్టి సపోర్ట్ ఉంది. ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. అలాంటి సి. కళ్యాణ్ ని దిల్ రాజు భారీ మెజారిటీతో ఓడించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సి. కళ్యాణ్ మంచు విష్ణుకు సపోర్ట్ చేశారు. అలాంటి సి. కళ్యాణ్ అధిపత్యానికి గండి కొట్టి దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు అయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని మంచు విష్ణు భావిస్తూ ఉండవచ్చు. ఒకవేళ ఎన్నికల బరిలో దిగినా ఓటమి ఎదురవుతుందనే భయం ఆయన్ని వెంటాడవచ్చు.
అలాగే మంచు విష్ణు ఎన్నికల ప్రచారంలో చాలా హామీలే ఇచ్చారు. ముఖ్యంగా మా బిల్డింగ్ అనే నినాదంతో వచ్చాడు. తన సొంత ఖర్చుతో మా బిల్డింగ్ నిర్మాణం చేపడతాను అన్నారు. అలాగే సినీ కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ రెండేళ్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిందేమీ లేదనే వాదన ఉంది. ముఖ్యంగా మా బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే ఉంది. ఇక మా అధ్యక్ష పదవి నెరవేర్చడం అంత సులభం కాదు. మనకెందుకు ఈ తలనొప్పులని ఆయన భావిస్తూ ఉండవచ్చు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో మంచు విష్ణు నిమగ్నమయ్యాడట. ఈ క్రమంలో సెప్టెంబర్-అక్టోబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలు 2024 మేకి వాయిదా వేశారట. మా బిల్డింగ్ కి ఇంకా పునాదులు కూడా పడలేదు. ఎన్నికల లోపు మంచు విష్ణు ఏం చేస్తారనేది చూడాలి. అదే సమయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. విష్ణు, మనోజ్ మధ్య దూరం పెరిగింది. ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంచు విష్ణు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.