Keeravani – Karthikeya: ఆస్కార్ గెలుచుకున్నామన్న ప్రకటన విన్నర్ మైండ్ బ్లాక్ చేస్తుంది. కాసేపు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్కార్ అవార్డుకి ఉన్న విలువ, గౌరవం అలాంటిది మరి. ప్రపంచం మొత్తం ఈ ఈవెంట్ ని వీక్షిస్తుంది. ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా వేల సినిమాలు తెరకెక్కుతాయి. వాటిలో ఆస్కార్ అందుకునే అదృష్టం ఒక ఇరవై ముప్పై చిత్రాలకు మాత్రమే దక్కుతుంది. అంత టఫ్ కాంపిటీషన్ ఆస్కార్ విషయంలో నెలకొంది.

ఆస్కార్ ని ఒక్కసారైనా గెలవాలి, వేదికపై ముద్దాడాలి, మన గురించి మన పేరెంట్స్ గురించి అవార్డుకు కారకులైన వారి గురించి ప్రపంచ వేదికపై మాట్లాడాలి, తెలియజేయాలనే కోరిక ఉంటుంది. రెండు నిమిషాల లోపు ముగిసే ఆస్కార్ విన్నర్ స్పీచ్ ఈ ఈవెంట్లో చాలా ప్రత్యేకం. విజేతల మాటలు, ఎమోషన్స్ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు, ఈవెంట్ చూస్తున్న ఆడియన్స్ ఆసక్తిగా గమనిస్తారు.
2023 ఆస్కార్స్ ఇండియన్ సినిమాకు మరపురాని అనుభూతులు పంచాయి. రెండు భారతీయ చిత్రాలు ఆస్కార్ గెలిచాయి. ఒరిజినల్ సాంగ్ నాటు నాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి ఆస్కార్ అందుకుంది. ఇక బెస్ట్ షార్ట్ ఫిల్మ్(డాక్యుమెంటరీ) కేటగిరీలో ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలుచుకుంది. ఇండియన్ ఆడియన్స్ దృష్టి మాత్రం ఆర్ ఆర్ ఆర్ మీద ఉంది. ఆస్కార్ గెలుచుకుంటుందా లేదా? అని ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఊహించిన విధంగానే నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంది. అయితే కీరవాణి స్పీచ్ కొంచెం నిరాశపరిచింది. బహుశా టెన్షన్లో ఆయన సరిగా మాట్లాడలేకపోయారేమో కానీ… రాజమౌళి, కార్తికేయ పేర్లు మాత్రమే తన స్పీచ్ లో మెన్షన్ చేశాడు. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కూడా వదిలేసి కార్తికేయ పేరు గట్టిగా పలికారు. ఇంత పెద్ద ఆస్కార్ వేదికపై హీరోలు, నిర్మాత, నాటు నాటుకు పని చేసిన సింగర్స్, కొరియోగ్రాఫర్ ని వదిలేసి కార్తికేయకు క్రెడిట్ ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉందట.
ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఇండియా నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కలేదు. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఆర్ ఆర్ ఆర్ ని కాదని చెల్లో షో అనే గుజరాత్ మూవీని ఎంపిక చేశారు. అక్కడ నుండి ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ని నిలిపేందుకు అవసరమైన అనుమతుల కోసం మార్గాలు వెతికింది కార్తికేయనే అట. వేరియన్స్ ఫిల్మ్స్ సహాయంతో ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఆస్కార్ ఎంట్రీ సులభం చేశాడట. అంతర్జాతీయ వేదికలపై స్పెషల్ స్క్రీనింగ్, బడ్జెట్ ఖర్చులు, పీఆర్ సంస్థలతో చర్చలు ఇలా… తెర వెనకుండి అన్నీ తానై నడిపాడట. అందుకే కీరవాణికి ఆస్కార్ వేదికపై క్రెడిట్ ఇచ్చాడట. రాజమౌళికి మించి ఆయన కొడుకు కార్తికేయ కృషి ఆస్కార్ అవార్డు వెనుక ఉందని సమాచారం.