spot_img
Homeఎంటర్టైన్మెంట్Razzakar: ‘రజాకార్‌’కు ఎందుకు భయపడుతున్నారు.. నిషేధం డిమాండ్‌ వెనుక ఆంతర్యం ఏముంది?

Razzakar: ‘రజాకార్‌’కు ఎందుకు భయపడుతున్నారు.. నిషేధం డిమాండ్‌ వెనుక ఆంతర్యం ఏముంది?

Razzakar: రజాకార్‌.. తెలంగాణ గడ్డపై మారణహోమం సాగించిన నిజాం సైన్యం. 80, 90 ఏళ్లు ఉన్న వారికి ఇప్పటికీ నాటి ఘటనలు గుర్తుండే ఉంటాయి. ఈ మారణఖాండను తాజాగా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ గత నెలలో రిలీజ్‌ అయింది. హైదరాబాద్‌ సంస్థానంలో రజాకర్లు చేసిన దారుణాల గురించి టీజర్‌లో చూపించారు. ఈ టీజర్‌పై నెటిజన్లు, రాజకీయ పార్టీలు, మత పెద్దలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్‌ కూడా స్పందించారు. తెలంగాణలో పాలిటిక్స్‌లో రజాకార్‌ టీజర్‌ దుమారం రేపుతోంది. సీపీఎం నాయకులు రిలీజ్‌ కాబోతున్న రజాకార్‌ మూవీని తెలంగాణ ప్రభుత్వం బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అసలు ఈ సినిమా ఏమిటి ? ఎందుకు దీన్ని నిషేధించాలి అంటున్నారు.. ఎవరికి భయం.. ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్న అంశాలు తెలుసుకుందాం.

హిందువులపై చేసిన అకృత్యాలు..
రజాకార్‌ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తున్నారు. బీజీపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్‌ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్‌కు రాలేదంటూ ఈ టీజర్‌ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్‌ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్‌ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు. చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు.

కేటీఆర్‌ ట్వీట్‌..
ఈ విషయం పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్‌ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్‌ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని అంటున్నారు.

సినిమా ప్రభావం ఎన్నికలపై ఉంటుందా..
ఇక రజాకార్‌ సినిమా ప్రభావం ఎన్నికలపై ఉంటుందనే ఆందోళన బీఆర్‌ఎస్‌లో కనబడుతోంది. తాజాగా బతుకమ్మ పండుగకు మూడు రోజుల ముందు.. రజాకార్‌ సినిమాలోని పాటను కూడా రిలీజ్‌ చేశారు. భారతి భారతి ఉయ్యాలో అంటూ సాగే పాట రజాకార్లపై రక్తం మరిగేలా కాసర్ల శ్యామ్‌ రాశారు. ఇందులో అనసూయ నటన ఆకట్టుకుంది. తెలంగాణ పండుగ అయిన బతుమ్మ పండుగ వేళ పాట రావడంతో బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌ మొదలైంది. టీజర్, పాటతోనే పరిస్థితిలు మారుతున్నాయని, సినిమా రిలీజ్‌ అయితే ఎన్నికలపై ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular