South Indian Movies: అంతకంతకూ బాలీవుడ్ పరిస్థితి దిగజారుతోంది. ఓ వైపు సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలు వందల కోట్ల వసూళ్లతో వరుస బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేస్తుంటే, హిందీ పరిశ్రమ చేతలుడిగి చూస్తుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో విడుదలైన స్టార్ హీరోల చిత్రాలన్నీ ఢమాల్ అన్నాయి. కపిల్ దేవ్ బయోపిక్ 83 మొదలుకొని జాన్ అబ్రహం అటాక్, రణ్వీర్ సింగ్ మరో చిత్రం జోర్దార్ జయేష్ భాయ్, షాహిద్ కపూర్ జెర్సీ, అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆర్యన్ కార్తీక్ బూల్ బులియా 2 మాత్రమే వంద కోట్ల వసూళ్లను దాటి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

అక్షయ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సామ్రాట్ పృథ్విరాజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. జూన్ 3న పాన్ ఇండియా చిత్రంగా సామ్రాట్ పృథ్విరాజ్ విడుదలైంది. మిగతా భాషల సంగతి దేవుడెరుగు.. హిందీలో ఈ మూవీ డిజాస్టర్ వైపుగా అడుగులు వేస్తుంది. ఫస్ట్ డే రూ.10.7 కోట్ల గ్రాస్ రాబట్టిన సామ్రాట్ పృథ్విరాజ్ శనివారం 12.60 కోట్లు, ఆదివారం మరింత పుంజుకొని రూ.16.10 కోట్లు రాబట్టింది. అయితే వీక్ డేస్ నుండి మూవీ వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఆరు రోజులకు గాను ఈ చిత్రం రూ.48.65 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ చిత్ర బడ్జెట్ నేపథ్యంలో సామ్రాజ్ పృథ్విరాజ్ బాలీవుడ్ కి మరో డిజాస్టర్ అంటున్నారు. మరోవైపు సౌత్ చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి. పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు సాధించాయి. లేటెస్ట్ సెన్సేషన్ విక్రమ్ సైతం భారీ వసూళ్లు దిశగా అడుగులు వేస్తుంది. సౌత్ చిత్రాలకు ఇలా ఆదరణ దక్కడం, నార్త్ చిత్రాలు నిరాదరణకు గురికావడం వెనుక కారణం ఒకటే.

ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. వాళ్లకు కావలసిన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ సౌత్ చిత్రాలు ఇస్తున్నాయి. వరుసగా సౌత్ ఇండియా చిత్రాలు విజయం సాధిస్తుండగా నార్త్ ప్రేక్షకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. అనుకోకుండా సౌత్ చిత్రాలపై నార్త్ లో హైప్ ఏర్పడుతుంది. ఇక్కడ నుండి ఓ భారీ చిత్రం విడుదలైతే థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, విక్రమ్ సక్సెస్ వెనుక కారణం అదే. బాలీవుడ్ అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ చిత్రాలకంటే మాస్ చిత్రాలను అక్కడి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మరి ఇదే కొనసాగితే మున్ముందు హిందీ పరిశ్రమకు గడ్డుకాలమే. ఇకనైనా హిందీ మేకర్స్ ఆడియన్స్ నాడి తెలుసుకుని చిత్రాలు తీస్తే విజయాలు దక్కుతాయి.